ఆ వ్యసనాన్ని ‘స్మార్ట్’గా తగ్గించుకోండి!
ఈరోజుల్లో చేతిలో ఫోన్ లేనిదే ఏ పనీ కావడం లేదు. షాపింగ్ దగ్గరనుంచీ లావాదేవీలు, ఎంటర్టైన్మెంట్, సోషల్ మీడియా.. ప్రతీదీ ఫోన్లోనే. దీంతో స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరిగిపోయింది. చిన్నాపెద్దా తేడాలేకుండా స్మార్ట్ ఫోన్లకు బాగా అలవాటు పడిపోయారు. కరోనా కారణంగా ఇది మరింత ఎక్కువైంది. దీంతో కుటుంబంతో గడపడం కంటే ఫోన్లో కాలక్షేపానికే మొగ్గు చూపే పరిస్థితి ఎదురవుతోంది. ఇక పిల్లలైతే చదువులు మానేసి గేమ్స్, వీడియోస్ అంటూ అర్ధరాత్రి వరకూ ఫోన్‌కే అతుక్కుపోతున్నారు. కాదని దండిస్తే ఎదురయ్యే పరిణామాలు తీవ్రంగా ఉంటున్నాయి. బంధాలు, బంధుత్వాలకంటే స్మార్ట్ ఫోన్‌తో సాన్నిహిత్యమే వ్యసనంగా మారిపోయింది. ఓ అధ్యయనం ప్రకారం సగటున ఒక వ్యక్తి రోజుకు 2,617 సార్లు ఫోన్ తాకుతున్నాడట. అంటే ప్రతీ 3 నిమిషాలకు ఓసారి ఫోన్ చూస్తున్నాడు. పెరిగిన స్క్రీన్ టైమ్ కారణంగా కంటిచూపుతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. అయితే ఈ వ్యసనాన్ని కాస్త జాగ్రత్తగా తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.
* ఫోన్ ఛార్జింగ్ పెట్టే సమయంలో దగ్గరగా కాకుండా దూరంగా పెట్టండి. దీంతో కొద్దిసేపైనా ఫోన్‌కు దూరంగా ఉండవచ్చు. రాత్రిపూట కాకుండా ఉదయాన్నే ఛార్జింగ్ పెట్టడం వల్ల దినచర్య ప్రారంభంలోనే ఫోన్‌తో కాకుండా ఇంట్లో వాళ్లతో కాసేపు మాట్లాడే వీలు చిక్కుతుంది.
* మాటిమాటికీ మోగే నోటిఫికేషన్లతో పెద్ద తలనొప్పి. నోటిఫికేషన్ శబ్ధం వినగానే ఎంత కాదనుకున్నా ఫోన్ చూడకుండా ఉండలేం. అందుకే నోటిఫికేషన్ అలెర్ట్‌ల్ని ఆపితే మీరు చాలా సమయం ఆదా చేసినవారు అవుతారు. మార్కెటింగ్ కాల్స్, మెసేజ్ రాకుండా డు నాట్ డిస్టర్బ్ ఆన్ చేయండి. ముఖ్యంగా పడుకునే వేళల్లో నోటిఫికేషన్ ఆపడం మంచిది.
* చాలామంది పడుకునేటప్పుడు ఫోన్‌ను పక్కనే పెట్టుకుంటారు. అలాకాకుండా పడుకునేటప్పడు ఫోన్‌ను దూరంగా పెట్టండి. ఇది ప్రశాంతంగా పడుకోడానికి ఉపయోగపడుతుంది. అర్ధరాత్రి వేళ ఫోన్ చూస్తూ నిద్ర పాడుచేసుకోకుండా ఉండేందుకు ఇది బాగా పనిచేస్తుంది. పడుకునే ముందు ఫోన్ చూస్తే నిద్ర సరిగ్గా పట్టదని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. అలాగే కొందరు ఉదయం నిద్ర లేవగానే ఫోన్ చూస్తూ చేయాల్సిన పనుల్ని మర్చిపోయి టైమ్ అవగానే హడావుడి పడతారు. అలాంటి ఉపద్రవాలు ఎదురవకుండా ఉండాలంటే ఫోన్ దూరంగా పెట్టి పడుకోవడం మంచిది.
* స్మార్ట్ ఫోన్ పక్కనపెట్టి ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో సరదాగా గడపండి. మాట్లాడండి. మంచి విషయాలు చర్చించండి. కలిసి భోజనం చేయండి. స్మార్ట్ ఫోన్‌తో ఎక్కువ సమయం గడపటం బదులు మీకు నచ్చిన ఓ పుస్తకాన్ని చదవండి. దీనివల్ల మీకు జీవితంలో చాలా విషయాలు తెలుస్తాయి. బంధాల విలువలు అవగాహనకు వస్తాయి.
పుస్తకం చదవడమే కాకుండా మీకు నచ్చిన పనికి ఎక్కువ పని కేటాయించండి. ఖాళీ సమయాల్లో పెయింటింగ్, ధ్యానం, యోగా వంటివి చేయండి. ఇవి మీ మనస్సుకు ప్రశాంతతను ఇస్తాయి.
* స్మార్ట్ ఫోన్ చూసే బదులు ఏదైనా కొత్త విషయం నేర్చుకోండి. దీనికిగానూ ఆన్‌లైన్ కాకుండా ఆఫ్ లైన్ కోచింగ్, ట్రైనింగ్ వెళ్లండి. దీనివల్ల చాలా విషయాల్లో మెరుగవుతారు. ఒకేసారి కాకుండా క్రమక్రమంగా స్మార్ట్ ఫోన్ వాడకం తగ్గిస్తే ఆరోగ్యంతోపాటు మానసికంగానూ దృఢంగా తయారవుతారు.