పరగడపున ఇవి అస్స‌లు వ‌ద్దు

ఆధునిక ప్రపంచంలో జీవనశైలితోపాటు ఆహారపు అలవాట్లు, వేళలు కూడా మారిపోయాయి. అందుకే చాలామందిలో రకరకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా మనం తినే ఆహారం మీదే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందంటున్నారు నిపుణులు. అంతేకాదు ఉదయం లేవగానే మనం తినే మొదటి ఆహారాన్ని బట్టే మన రోజంతా శరీరం ఎలా ఉంటుందో డిసైడ్​ అవుతుందట. మంచి ఆరోగ్యకరమైన ఆహారంతో రోజు ప్రారంభిస్తే రోజంతా ఉల్లాసంగా ఉంటారట. అలా కాకుండా ఏది అందుబాటులో ఉంటే దాన్ని తినేస్తే రోజంతా కడుపులో గడబిడే.. అందుకే, ఉదయాన్నే తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. లేకపోతే అజీర్ణం, గ్యాస్ సమస్యలు తప్పవని కూడా హెచ్చరిస్తున్నారు. మరి ఉదయం లేవగానే పరగడపుతో తినకూడని ఆహార పదార్థాలేవో తెలుసుకుందాం..
కాఫీ, టీ
వేడివేడి పొగలు కక్కే కాఫీ, టీతో రోజుని ప్రారంభించడం చాలామందికి ఉండే అలవాటు. అయితే వేడిగా కాఫీ, టీలు తాగేటప్పుడు శరీరానికి, మనసుకీ రీఫ్రెష్‌ భావన కలుగుతుందేమో కానీ, తర్వాత మాత్రం ఇది చాలా సమస్యలకు దారితీస్తుంది. ఖాళీ కడుపుతో టీ, కాఫీ తాగడం వల్ల అసిడిటీ వస్తుంది. అంతే కాకుండా డీహైడ్రేషన్ సమస్య ఎదురవుతుంది. వీటి బదులు నీరు తాగడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ ఫ్రిజ్​లో నీళ్లు తాగకూడదు. గోరువెచ్చని నీళ్లు తాగితే మంచిది. రాత్రి పూట నానబెట్టిన బాదం, ఎండుద్రాక్షలను తీసుకోవచ్చు. ఆ తర్వాత టీ, కాఫీ తీసుకుంటే సమస్యలు రావు. అలాగే ఉదయాన్నే లేస్తూనే ఐస్ టీ, కోల్డ్ కాఫీ వంటివి తాగడం కూడా మంచిది కాదు. మిగతా సమయాల్లో ఫర్వాలేదు కానీ, ఖాళీ కడుపుతో తీసుకుంటే మాత్రం కడుపులో శ్లేష్మ పొర దెబ్బతిని జీర్ణ క్రియ మందగిస్తుంది.
కూల్ డ్రింక్స్
కూల్ డ్రింక్స్‌ని కూడా ఖాళీ కడుపుతో తీసుకోకపోవడమే మంచిది. వీటిలోని గ్యాస్​ రూపంలో ఉండే కార్బన్ డై యాక్సైడ్​ అజీర్ణ సమస్యలను కలిగిస్తుంది. ఖాళీ కడుపుతో తాగినప్పుడు జీర్ణాశయ గోడలనూ దెబ్బతీసే ప్రమాదం ఉంది. వీటిని తరచూ తాగడం వల్ల వికారం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి, పరగడపునే కాదు మిగతా సమయాల్లోనూ వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెబుతున్నారు నిపుణులు.
పచ్చి కూరలు
ఉదయాన్నే బ్రేక్​ఫాస్ట్​గా చాలామంది పచ్చి కూరగాయలతో సలాడ్స్ చేసుకుని తింటారు. దీని వల్ల బరువు తగ్గుతారు. కానీ, ఖాళీ కడుపుతో తింటే మాత్రం జీర్ణ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి కడుపునొప్పికి కారణమవుతుంది. మిగతా సమయాల్లో ఇలాంటి సలాడ్స్​ తినడం వల్ల చాలా మంచిది, కానీ ఖాళీ కడుపుతో తినకపోవడమే మంచిది.
స్పైసీ ఫుడ్
కొంతమంది స్పైసీ ఫుడ్​ని ఇష్టపడతారు. ఉదయాన్నే స్పైసీ ఫుడ్ తింటారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. సాధారణంగా స్పైసీ ఫుడ్​ మామూలు సమయంలోనే మంచిది కాదు. ఇక ఖాళీ కడుపుతో తింటే అసిడిటీకి కారణమవుతుంది. మసాలాలు, కారం వీలైనంత తక్కువగా తినాలి. వీటి మోతాదు పెరిగితే రక్తపోటు వచ్చే ప్రమాదం ఎక్కువ. వీటవల్ల కడుపులో మంట, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా కడుపు, ఛాతీ బరువుగా అనిపిస్తుంది. ఫైబర్ పదార్ధాలు కడుపుకి మంచివే. కానీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే మాత్రం నష్టం చేకూరుస్తాయి. ఫలితంగా కడుపులో నొప్పి, కడుపు పట్టేయడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే పరిమిత మోతాదులోనే ఫైబర్ పదార్ధాలు తీసుకోవాలి. ఉదయం పరగడుపున తీసుకునే ఆహారం ఎంత తేలిగ్గా ఉంటే ఆరోగ్యానికి అంత మంచిది.

సిట్రస్ పండ్లు
ఖాళీ కడుపుతో విటమిన్​ సి ఎక్కువగా ఉండే సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల జీర్ణాశయంలో అధిక మొత్తంలో యాసిడ్ రిలీజ్ అవుతుంది. వీటిని ఖాళీ కడుపుతో తినడం వల్ల కడుపులో భారంగా ఉంటుంది. మిగతా ఏ సమయంలో తిన్నా ఇవి శరీరానికి మంచివే కానీ, ఖాళీ కడుపుతో తినడం అస్సలు మంచిది కాదని దీని వల్ల కడుపులో సమస్యలు తప్పవని చెబుతున్నారు నిపుణులు.