రాముడి కుమారుడు కట్టిన ఆలయం గురించి తెలుసా?
Spiritual: శ్రీరామచంద్రుడి ముద్దుల కుమారుడు కుశుడు కట్టించిన ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా? ఈ ఆలయం ఎక్కడో కాదు అయోధ్యలోనే ఉంది. ఆ ఆలయం పేరు నాగేశ్వరనాథ్ ఆలయం. అయోధ్యలోని రామ్ కీ పైరీలో ఉంది ఈ ఆలయం. ఈ ఆలయం గురించి మరిన్ని ఆసక్తికర అంశాలను తెలుసుకుందాం.
స్థానిక సరయు నదీతీరాన కుశుడు స్నానం ఆచరిస్తున్నప్పుడు తన చేతికి ఉన్న కడియాన్ని పోగొట్టుకున్నాడట. అదే నదీతీరాన ఉన్న కుముదిని అనే నాగకన్యకు ఆ కడియం లభించింది. ఆ కడియంతో పాటే నాగలోకానికి వెళ్లిపోయింది. ఈ విషయం కుశుడికి తెలీడంతో కోపోద్రిక్తుడై సర్పాలన్నీ నాశనమవుగాక అని శపించాడట. దాదాపు 25 వేల సంవత్సరాల పాటు కుశుడు సర్పాలతో యుద్ధం చేస్తూనే ఉన్నాడు.
సర్పాలకు ఇక యుద్ధం చేసే ఓపిక లేక శివయ్యను వేడుకున్నాయి. అడిగిన వెంటనే వరాన్ని ప్రసాదించే శివయ్య తక్షిణమే సర్పాలకు ఆశీర్వాదం ఇచ్చి కుశుడి కోపాన్ని అదుపు చేస్తాడు. అప్పుడు కుశుడు తాను చెప్పిన చోటే లింగం రూపంలో అవతరించాలని కోరతాడు. ఇందుకు కూడా శివయ్య ఒప్పుకుంటాడు. ఆ తర్వాత కుశుడు నాగ కన్యను వివాహం చేసుకుని ఈ నాగేశ్వరనాథ్ ఆలయాన్ని స్థాపించాడు. ఈ ఆలయానికి రోజూ వందలాది భక్తులు వస్తుంటారు.