EXCLUSIVE: హైదరాబాద్‌లోనే అతి పురాతన రామాలయం గురించి తెలుసా?
EXCLUSIVE: హైదరాబాద్‌లోని శంషాబాద్‌కు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మపల్లి శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా? 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం హైదరాబాద్‌లోనే అతి పురాతనమైనది. కానీ దురదృష్టవశాత్తు ఈ ఆలయం గురించి చాలా మందికి తెలీదు. ఇంతటి పురాతన ఆలయం మన తెలుగు రాష్ట్రంలోనే ఉన్నప్పటికీ నిన్నటి వరకు ఖాళీగా ఉండేది. కానీ ఈరోజు అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తి ప్రాణ ప్రతిష్ఠ జరిగిన నేపథ్యంలో ఒక్కసారిగా ఈ ఆలయానికి భక్తులు పోటెత్తారు.
ఆలయ పూజారి తెలిపిన వివరాల ప్రకారం.. నిన్నటి వరకు ఖాళీగా ఉండే ఈ ఆలయం ఈరోజు ఇలా కిటకిటలాడుతోందని ఆనందపడాలో లేక రేపటి నుంచి మళ్లీ ఎవ్వరూ రారని బాధ పడాలో తెలీడంలేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలయంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఇక్కడ నిర్మించిన ఫంక్షన్ హాల్. 500 మంది గెస్ట్‌లకు సరిపోయేలా కేవలం రూ.11,000 ఖర్చుతోనే ఇక్కడ వివాహాలు జరిపిస్తారట. పక్కనే ఓ డైనింగ్ హాల్‌ను కూడా కడుతున్నారు. ఇక్కడ ఫోటో షూట్స్ ఎక్కువగా జరుగుతుంటాయి.
చాళుక్య వంశస్థులు ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఆలయంలోని ప్రతీ కట్టడం రామాయణాన్ని గుర్తుకు చేసేలా ఉంటుంది. సీతను రావణాసురుడు లంకకు ఎత్తుకెళ్లినప్పుడు రామయ్య ఎలా తన సతీమణిని దక్కించుకున్నాడో ఈ ఆలయ కట్టడాలు కథగా చెప్తున్నట్లు కనిపిస్తాయి. అదే ఈ ఆలయ ప్రత్యేకత. మీకు వీలున్నప్పుడు తప్పకుండా ఈ ఆలయంలోని శ్రీరామచంద్రమూర్తిని దర్శనం చేసుకోండి.