హఠాత్తుగా ఆగిపోతున్న గుండె.. ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు!

కారణాలు ఏవైనా ఎప్పుడు ఎవరికి ఏమవుతుందో తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయి. పెద్దాచిన్నా తేడా లేకుండా అన్ని వయస్సుల వారినీ కార్డియాక్ అరెస్టులు వణికిస్తున్నాయి. అప్పటివరకు బాగున్న మనుషులు ఎక్కడ చూసినా క్షణాల్లో కుప్పకూలడం, ఆపై ప్రాణాలు కోల్పోవడం ఆందోళన కలిగిస్తుంది. గతంలో కంటే చాలా ఎక్కువగా,  హఠాత్తుగా వస్తున్న గుండెపోటులపై ప్రతి ఒక్కరిలోనూ ఆందోళన కలుగుతోంది. ప్రతిరోజు ఎక్కడో ఒకచోట గుండెపోటుకు గురై ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడం భవిష్యత్తుపై నిరాశను కలిగిస్తోంది.

ఊబకాయంతో ఉండి, శారీరక వ్యాయామం లేని వారే కాదు, ఫిట్ నెస్ ఉన్నవారు, రోజూ వ్యాయామం చేసే వారు, పూర్తి ఆరోగ్యంగా ఉన్నవాళ్లు, జిమ్ కి వెళ్లి రోజు ఎక్సర్సైజులు చేసేవాళ్లు, చిన్న చిన్న వయసుల వాళ్లు కూడా కార్డియాక్ అరెస్టులకు గురికావడం అందరిని విస్మయానికి గురిచేస్తుంది. గతంలో కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ జిమ్ లో వర్కవుట్ చేస్తూ కుప్ప కూలిపోతే, ఇటీవల తారకరత్న హార్ట్ ఎటాక్ తో 23 రోజులపాటు ఆసుపత్రిలో ప్రాణాల కోసం కొట్లాడి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

వరుస ఘటనలు..

ఆ తర్వాత అనేక మంది వరుసగా గుండెపోటుకు గురవుతూ ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న కిషన్ రెడ్డి మేనల్లుడు గుండెపోటుతోనే ప్రాణాలు కోల్పోయారు. ఇక నిన్న గుజరాత్ లో ఒక వధువు మరికాసేపట్లో పెళ్లి జరగబోతుంది అనగా గుండెపోటుతో కుప్పకూలి, ప్రాణాలు విడిచింది. మొన్న పెళ్లి పీటల మీద ఒక వరుడు ఉన్నచోటే కుప్పకూలిపోయాడు. ఇక ఇటువంటి వరుస ఘటనలు అనేకం చోటు చేసుకుంటున్న పరిస్థితుల్లో గుండె పోటుపైన ప్రతి ఒక్కరు ఆందోళన చెందుతున్నారు.

జిమ్​ చేస్తూ..

హైదరాబాద్​లోని బోయిన పల్లికి చెందిన విశాల్​ (24)  అనే కానిస్టేబుల్​ కూడా ఇటీవలే కార్డియాక్​ అరెస్ట్​తో కన్నుమూశాడు. ఉదయాన్నే జిమ్​కి వెళ్లి వ్యాయామం చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలి ప్రాణాలు వదిలాడు. ఇదే తరహా ఘటన ఆంధ్రప్రదేశ్​లోని ఆదోనిలో కూడా చోటు చేసుకుంది. హైదరాబాద్​లో సాఫ్ట్​వేర్​ ఇంజనీర్​గా పనిచేస్తున్న ఓ యువకుడు ఉదయాన్నే జిమ్​ చేస్తూ కుప్పకూలిపోయాడు. అక్కడున్నవారు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. దేశవ్యాప్తంగా చాలామంది వయస్సుతో సంబంధం లేకుండా గుండె సంబంధ సమస్యలు ఎదుర్కొని హఠాత్తుగా ప్రాణాలు కోల్పోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది.