“హార్ట్ ఎటాక్” రెస్టారెంట్..లావుగా ఉంటే ఫ్రీ ఫుడ్
ఆ రెస్టారెంట్ పేరే హార్ట్ ఎటాక్. పేరు వింటేనే గుండెలో దడగా ఉన్నట్టుంది కదా. ఈ దిక్కుమాలిన రెస్టారెంట్ మన ఇండియాలో మాత్రం లేదులెండి. ఉంటే.. ఈపాటికే జనాల చేతిలో ధ్వంసం అయిపోయి ఉండేది. అసలే కోవిడ్ కారణంగా, లైఫ్‌స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్ల చిన్నవయసులోనే గుండెపోటుతో చనిపోతున్నారు. దాంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మంచి ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని ఓ రెస్టారెంట్ మాత్రం ప్రజల ఆరోగ్యాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా పైగా ఉచితంగా ఆహారం ఇస్తామంటూ తప్పుదోవ పట్టిస్తోంది.
ఉచితంగా ఆహారం ఇస్తే మంచిదే కదా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే.. వారు ఉచితంగా ఆహారం ఇచ్చేది 158 కిలోల కంటే ఎక్కువ బరువు ఉండేవారికి. మీరు విన్నది నిజమే. ఈ దిక్కుమాలిన ఐడియా అమెరికాలోని లాస్ వెగాస్‌కు చెందిన జాన్ బాసో అనే వ్యక్తికి వచ్చింది. అసలు ఇలాంటి ఒక రెస్టారెంట్ పెట్టాలని అతనికి ఎందుకు అనిపించిందంటే.. అమెరికాలో ఆరోగ్యానికంటే.. అతిగా తినేసి పొట్టనింపుకోవాలని చూసేవారే ఎక్కువ ఉన్నారని వారి మీద సెటైర్ వేయడానికే ఈ రెస్టారెంట్ తెరిచానని జాన్ అంటున్నాడు. ఈ రెస్టారెంట్‌కు హార్ట్ ఎటాక్ గ్రిల్ అని పేరు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు ఈ రెస్టారెంట్ చూడటానికి హాస్పిటల్‌లాగే ఉంటుంది. అంతేకాదు.. ఇందులో వడ్డించేవారు వండేవార్లు డాక్టర్లు, నర్సుల్లా తెల్లకోటు ధరించి ఉంటారు. మగవారైతే డాక్టర్లుగా, ఆడవారు నర్సుల్లా పనిచేస్తుంటారు.
ఇక్కడికి తినడానికి వచ్చే కస్టమర్లు సైతం పేషంట్లలా తయారవ్వాలి. ఈ రెస్టారెంట్‌లో 2005లో లాస్ వెగాస్‌లోని నెవాడాలో ప్రారంభించారు. మొదట్లో ఎక్కువ కొవ్వు, పిండి పదార్థాలు ఉన్న ఆహారాన్ని సప్లై చేసేవారట. ఇప్పుడు 158 కిలోల కంటే ఎక్కువ బరువు ఉన్నవారికి ఉచితంగా రుచికరమైన ఆహారాన్ని ఇస్తామని ఆశపెడుతున్నారు. ఫుడీస్ ఈ ఆఫర్‌ను వదులుకోలేక ఆమ ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా రెస్టారెంట్‌కి వెళ్లి లాగించేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటూ వారి జీవితాలను రిస్క్‌లో పెడుతున్న ఈ రెస్టారెంట్‌ను మూసివేయాలని ట్విటర్‌లో కంప్లైంట్లు వెల్లువెత్తుతున్నాయి. విచిత్రం ఏంటంటే. 2005 నుంచి అమెరికాలోని పలు ప్రదేశాల్లో ఈ రెస్టారెంట్ చైన్‌ను ప్రారంభించారు. ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నప్పటికీ ఈ రెస్టారెంట్‌కు ఇంతటి ఆదరణ ఎలా వచ్చిందో తెలీడంలేదు.