త‌ల్లికి కోవిడ్.. క‌డుపులో బిడ్డ‌కు బ్రెయిన్ డ్యామేజ్!

కోవిడ్ మ‌హ‌మ్మారి ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త వేరియంట్‌తో ప్ర‌పంచాన్ని హ‌డ‌లుకొడుతూనే ఉంది. ఈ మ‌ధ్యకాలంలో ఎన్న‌డూ లేని విధంగా ఇండియాలోనూ కోవిడ్ కేసులు గ‌ణ‌ణీయంగా పెరుగుతున్నాయి. ఈ వేరియంట్ అంత ప్ర‌మాద‌క‌ర‌మైన‌ది కాక‌పోయిన‌ప్ప‌టికీ.. జాగ్ర‌త్త‌లు తీసుకుంటేనే మంచిద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే సాధ‌ర‌ణంగా కోవిడ్ రావ‌డం ఒక ఎత్తైతే.. గ‌ర్భిణుల‌కు కోవిడ్ వ‌చ్చి అది క‌డుపులోని బిడ్డ‌కు శాపంగా మారిన ఘ‌ట‌న అమెరికాలో వెలుగుచూసింది.

2020లో కోవిడ్ మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న స‌మ‌యంలో అమెరికాకు చెందిన ఇద్ద‌రు మ‌హిళ‌లు గ‌ర్భం దాల్చారు. క‌డుపులో పిండాలు ఎదుగుతున్న స‌మ‌యంలో కోవిడ్ గ‌ర్భ‌స్థ‌మావిలోకి ప్ర‌వేశించింద‌ట‌. దాంతో ఆ మ‌హిళ‌లు ఇద్ద‌రికీ డెలివ‌రీ అయిన రోజున పిల్ల‌ల‌కు ఫిట్స్ వ‌చ్చాయ‌ట‌. అయితే ఆ పిల్ల‌లు ఇద్ద‌రికీ కోవిడ్ సోక‌న‌ప్ప‌టికీ.. ట్రీట్మెంట్‌లో భాగంగా మ‌హిళ‌లు తీసుకున్న మందుల కార‌ణంగా పిల్ల‌లో విప‌రీతంగా కోవిడ్ యాంటీబాడీలు ఉన్న‌ట్లు గుర్తించారు. అంతేకాదు.. ఇద్ద‌రు పిల్ల‌ల్లో ఒక ప‌సికందు బ్రెయిన్ డ్యామేజ్‌తో 13 నెల‌ల్లోనే చ‌నిపోగా.. మ‌రో ప‌సికందుకు ఎదుగుద‌ల‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని వైద్యులు తెలిపారు. ప్ర‌స్తుతం ఆ ప‌సికందును ప్ర‌త్యేక‌మైన కేర్ రూంలో అబ్స‌ర్వేష‌న్‌లో ఉంచారు.

బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి చ‌నిపోయిన ప‌సికందుకు శ‌వ‌ప‌రీక్ష నిర్వ‌హించిన‌ప్పుడు.. కోవిడ్ కార‌ణంగా ఇన్‌ఫెక్ష‌న్ బిడ్డ బ్రెయిన్‌పై నేరుగా ప్ర‌భావం చూపింది. అయితే ఇలాంటి కేసులు అరుదుగా క‌నిపిస్తుంటాయని, అయిన‌ప్ప‌టికీ గ‌ర్భందాల్చిన‌ప్పుడు కోవిడ్ వ‌స్తే త‌ప్ప‌కుండా గైనకాల‌జిస్ట్‌ను సంప్ర‌దించి ప్ర‌తి వారం బిడ్డ ఎదుగుతున్న తీరు ఎలా ఉందో తెలుసుకుంటూ ఉండాల‌ని వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.