YSRCP: వద్దని చెప్పినా టికెట్లు.. పార్టీలో ఉద్రిక్తత..!
YSRCP పార్టీలో ఉద్రిక్తత నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో ఆర్కే రోజాకు (RK Roja), అంబటి రాంబాబులకు (Ambati Rambabu) టికెట్లు కేటాయించొద్దని.. వారికి నియోజకవర్గంలో ఏమాత్రం సపోర్ట్ లేదని పలువురు కార్యకర్తలు హెచ్చరించినప్పటికీ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ వారికి టికెట్లు కేటాయించారు. ఈసారి కూడా రోజా నగిరి నుంచి అంబటి రాంబాబు సత్తెనపల్లి నుంచి బరిలోకి దిగనున్నారు. దాంతో ఎంత వద్దని చెప్పినా మళ్లీ టికెట్లు కేటాయించడంపై పలువురు నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. ఈసారి వారి కోసం పనిచేసి గెలిపించలేమని తేల్చి చెప్పేసారు.
నగిరి ఎమ్మెల్యే, మంత్రి రోజాకు అసమ్మతి సెగ ఎక్కువ అవుతోంది. ఈమె పోటీ చేస్తే ఓడిస్తామని పార్టీ నేతలు అధిష్ఠానానికి అల్టిమేటం ఇచ్చారు. రోజాకు టికెట్ ఇస్తే తాము వైసీపీని వదిలేస్తామని హెచ్చరించారు. అయినా పార్టీ నాయకత్వం పట్టించుకోకుండా మళ్లీ రోజాకు సీటు ఇచ్చింది. తీరా అసమ్మతి వర్గాన్ని తాడేపల్లి ప్యాలెస్‌కు పిలిపించారు. కానీ రోజా కూడా వస్తున్నారని తెలుసుకున్న వ్యతిరేక వర్గం అక్కడి నుంచి వెళ్లిపోవడం హాట్ టాపిక్‌గా మారింది. వ్యతిరేక వర్గాన్ని రెచ్చగొడుతున్నది మంత్రి పెద్ది రెడ్డే అని గతంలో ఆరోపించిన రోజా పతీ సమేతంగా వెళ్లి కలిసి చర్చించారు. కానీ వ్యతిరేక వర్గం మాత్రం రోజాకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది.
అంబటి రాంబాబు విషయంలో మరింత ఉద్రిక్తంగా పరిస్థితులు ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈయనకు నీటి పారుదలశాఖ కన్నా నోటి పారుదల శాఖను కేటాయిస్తే బాగుండేదని విరుచుకుపడుతున్నారు. ఎప్పుడూ పవన్ కళ్యాణ్, నారా లోకేష్, చంద్రబాబు నాయుడులపై పడి ఏడుస్తుంటారని.. ఏనాడు కూడా ఏపీ నీటి పారుదల శాఖకు సంబంధించి ప్రెస్ మీట్స్ పెట్టింది లేదని విమర్శిస్తున్నారు.
ALSO READ: SVSN Varma: పవన్ అడుక్కుంటే సీటిచ్చాం.. నేనే సేనాధిపతిని
పార్టీలో అంతర్గత శత్రువులను పెంచి పోషించారన్న టాక్ కూడా అంబటి రాంబాబుపై ఉంది. నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఉన్న సీఎం జగన్ సామాజిక వర్గం నేతలు.. అంబటి రాంబాబుకు టికెట్ ఇవ్వొద్దని లాబీయింగ్ చేసారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు సీటు ఇవ్వాలని నిర్ణయించిన జగన్ అసమ్మతి వర్గం నేతలను పిలిపించి మాట్లాడారు. రాంబాబును కాకుండా తనను చూసి పార్టీ కోసం పనిచేయాలని నచ్చజెప్పే ప్రయత్నం చేసారట. ఈ ఐదేళ్ల కాలంలో రాంబాబు తమను ఇబ్బంది పెట్టిన విషయాలను ముఖ్యమంత్రితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి తెచ్చే ప్రయత్నం చేసారు. అన్నీ తాము చూసుకుంటామని పార్టీ పెద్దలు భరోసా ఇచ్చినప్పటికీ సత్తెనపల్లిలో ఆ సామాజిక వర్గం మాత్రం అంబటికి ఆమడ దూరంలోనే ఉంటోందన్న టాక్ ఉంది. అలాంటివారిలో కొందరు తెలుగు దేశం అభ్యర్ధి కన్నా లక్ష్మీనారాయణతో టచ్‌లోకి వెళ్లారని సమాచారం.
ఇక చిలకూలురి పేట నుంచి గుంటూరు పశ్చిమ నియోజకవర్గానికి బదిలీపై వచ్చిన విడదల రజినీకి (Vidadala Rajini) వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. చిలకలూరిపేట వైసీపీ నేత మల్లెల రాజేష్ నాయుడు రజినీకి షాకిచ్చారు. ఈ నియోజకవర్గ టికెట్‌ను తనకు ఇప్పించేందుకు రజినీ ఆరున్నర కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. దాంతో YSRCP ప్రతిష్ఠ మంటగలిసిందన్న ప్రచారం జరిగింది. దీంతో రజినీ ప్రచారంలో వేగం పెంచిన సమయంలో రాజేష్ చేసిన ఈ ఆరోపణలు మంత్రి దూకుడుకు బ్రేకులు వేసాయి.
డబ్బులు ఇచ్చినా సీటు రాలేదని రాజేష్ ఆగ్రహం వ్యక్తం చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఆ తర్వాత ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడంతో మూడున్నర కోట్లు తిరిగిచ్చేసారని మిగిలిన డబ్బులు ఇవ్వలేదని రాజేష్ నాయుడు ఆరోపించడంతో పార్టీ ప్రతిష్ఠ మంటగలిసిందని కేడర్ చెప్తోంది. ఈ వ్యవహారం మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయింది. చివరకు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కూడా ఈ ఆరోపణలపై స్పందించారు.
వైసీపీలో టికెట్లు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలు చేసారు. ఈ నేపథ్యంలో చిలకలూరిపేట వైసీపీ ఇన్ఛార్జిగా రాజేష్‌ను తొలగించి గుంటూరు మేయర్ మనోహర్ నాయుడుని ఆ స్థానంలో అభ్యర్ధిగా పంపారు. ఎన్నికల ముందు జరిగిన ఈ పరిణామం రజినీ ఇమేజ్‌ను డ్యామేజ్ చేసింది. దీంతో ఇటీవల మల్లెల రాజేష్‌ను తాడేపల్లి ప్యాలెస్‌కు పిలిపించి పంచాయతీ పెట్టినట్లు సమాచారం. ఈ నేత చేసిన ఆరోపణలు జనంలోకి వెళ్లిన తర్వాత పార్టీ నాయకత్వం మీటింగ్ పెడితే ఉపయోగం ఏంటి అని కేడర్ మండిపడింది.
ఇలా ప్రతిపక్షాలపై నోరు పారేసుకోవడానికి మాత్రమే ఈ ఐదేళ్ల అధికారాన్ని వినియోగం చేసుకున్న నేతలు ఈసారి ఎన్నికల్లో గెలవడం కష్టమే అనే టాక్ అయితే బలంగా వినిపిస్తోంది.