YSRCP On Alliance: పొత్తులపై YCP నేతల స్పందనేంటి? ఏమన్నారు?
YSRCP On Alliance: తెలుగు దేశం (Telugu Desam Party), జనసేన (Janasena) పార్టీలు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో అధికార YSRCP నేతలు స్పందించారు. పొత్తులపై ఎవరు ఏమన్నారో ఓ లుక్కేద్దాం.
YCP గెలుపు తథ్యం – సజ్జల
ఏపీ ప్రభుత్వ విప్ సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) పొత్తులపై స్పందించారు. ఎన్ని పార్టీలు కలిసి దూసుకొచ్చినా రానున్న ఎన్నికల్లో YSRCP గెలుపు తథ్యమని.. ఈ విషయం పొత్తులతోనే క్లియర్‌గా తెలుస్తోందని అన్నారు. నేతలు కూడా జగన్ మోహన్ రెడ్డే (Jagan Mohan Reddy) రెండో దఫా ముఖ్యమంత్రి అవుతారని కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అధికారంలోకి రావాలని అనైతికంగా పొత్తులకు పాల్పడే పార్టీలతో YSRCPకి పోలిక ఏంటి అని విమర్శించారు.
CMకి అర్థమేంటి : అంబటి రాంబాబు
పొత్తుపై మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) స్పందిస్తూ ఈ విధంగా ట్వీట్ చేసారు
CM CM అని అరిసిన ఓ కాపులారా!
CM అంటే చీఫ్ మినిస్టరా?
CM అంటే సెంట్రల్ మినిస్టరా?
CM అంటే చంద్రబాబు మనిషా?
CM అంటే చీటింగ్ మనిషా ?
దివంగత నేత నందమూరి తారక రామారావు ఏ విలువలతో పార్టీని పెట్టారో ఆ విలువలను మంటగలిపి మరీ చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పొత్తులకు పోయాడని అంబటి రాంబాబు విమర్శించారు. గతంలో తెలుగు దేశం, భారతీయ జనతా పార్టీకి మధ్య వచ్చిన విభేదాలను కూడా మర్చిపోయి అధికార దాహంతో ఇంతకు దిగజారాలా అని ప్రశ్నించారు. (YSRCP On Alliance)
జనాలు అసలు పట్టించుకోవడంలేదు : మిథున్ రెడ్డి
తెలుగు దేశం, భారతీయ జనతా, జనసేన పార్టీల పొత్తును అసలు జనం కూడా పట్టించుకోవడంలేదని అన్నారు ఎంపీ మిథున్ రెడ్డి (Mithun Reddy). విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ చేయాల్సింది ఇంకా చాలా ఉందని అది మానేసి పొత్తులు పెట్టుకుంటే ఏం లాభమని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడుకి ఉన్న లీగల్ సమస్యలను తీర్చుకోవడానికే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నట్లు ఉన్నారని విమర్శించారు.
BJP చంద్రబాబు కోసమే : కురసాల కన్నబాబు
తెలుగు దేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రం పేరు చెప్పి చివరికి చంద్రబాబు నాయుడుకే పనిచేస్తుందని విమర్శించారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు (Kurasala Kannababu). భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఎంతగా ఆరాటపడ్డారో అంతా చూసారని.. చంద్రబాబు YSRCPకి భయపడే పొత్తుకు పోయారని అన్నారు. గతంలో వచ్చిన విభేదాలను కూడా మర్చిపోయి చంద్రబాబు నాయుడు మళ్లీ పాత గూటికే ఎలా పోయారో ఆయనకే తెలియాలని అన్నారు.
ఒంటరిగా గెలిచే దమ్ము లేకే: గుడివాడ అమర్నాథ్
ఎన్నికల్లో ఒంటరిగా గెలిచే దమ్ము లేకే చంద్రబాబు నాయుడు పొత్తులు పెట్టుకున్నారని ఆయనకు ఈ పొత్తులు కొత్తేమీ కాదని అన్నారు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath). చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పబ్లిక్‌లో మాట్లాడేది ఒకటి.. ప్రైవేట్‌గా చేస్తున్నది మరొకటని.. అసలు ఇద్దరి వ్యాఖ్యల్లో పొంతనే ఉండదని విమర్శించారు.
తెలుగోళ్ల ఆత్మగౌరవాన్ని మంటగలిపారు: కేసినేని నాని
తెలుగు దేశం పార్టీని తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు పెట్టిన పార్టీ అని దానిని చంద్రబాబు ఢిల్లీలో అగౌరవపరిచారని అన్నారు మాజీ తెలుగు దేశం పార్టీ ఎంపీ.. ప్రస్తుత YSRCP నేత కేసినేని నాని (Kesineni Nani). అమిత్ షాతో మాట్లాడేందుకు ఢిల్లీలో చంద్రబాబు ఏకంగా 3 రోజులు పడిగాపులు కాసారని.. ఎన్ని ప్రయత్నించినా జగన్‌ను ఓడించడం చంద్రబాబుకి చాలా కష్టం అని తెలిపారు. జగన్ 175 నియోజకవర్గాల్లో గెలిచి తీరతారని ధీమా వ్యక్తం చేసారు. ఇప్పుడు రాబోతున్న ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అవుతుందని తెలిపారు.