సజ్జల అవుట్.. వైసీపీకి కొత్త సలహాదారు
Sajjala Ramakrishna Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్త సలహాదారు నియమితులయ్యారు. పార్టీ నిర్మాణం, బలోపేతం కోసం జగన్ మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. మొన్నటి వరకు సలహాదారుగా సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. ఇప్పుడు ఆయన్ను పక్కన పెట్టి సలహాదారు బాధ్యతలను ఆళ్ల మోహన్ సాయిదత్‌కు అప్పగించారు. సాధారణంగా అయితే పార్టీని స్థాపించక ముందు కానీ స్థాపించిన కొత్తలో కానీ తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న సమయంలోనో పార్టీకి అవసరమైన సలహాదారులను నియమించుకుంటూ ఉంటారు. ఇది రాజకీయాల్లో ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది.
కానీ వరుసగా ఉప ఎన్నికల్లో పోటీ చేయడంతో పాటు.. రెండుసార్లు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయాక సలహాదారును నియమించుకోవడం చర్చనీయాంశంగా మారింది. అధికారంలో ఉన్నప్పుడు వందలాది మంది సలహాదారులుగా నియమించారు జగన్. కానీ వారి నుంచి ఏనాడూ ఒక్క నిర్మాణాత్మకమైన సలహాను కూడా ఆయన తీసుకోలేదు. ఎవరైనా సలహాలు ఇచ్చినా వారిని తప్పించేవారు. మరి ఇప్పుడు ఈ సాయిదత్ అనే వ్యక్తి సలహాలైనా తీసుకుంటారో లేదో అనే చర్చ పార్టీ నేతల్లో జరుగుతోంది.