YS Sunitha Reddy: దయచేసి మా అన్నకు ఓటెయ్యొద్దు
YS Sunitha Reddy: మా నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాఈ మార్చి 15కి మా నాన్న చనిపోయి ఐదేళ్లు కావొస్తోంది. సాధారణంగా ఎవరైనా చనిపోతే నాలుగు, ఐదు రోజుల్లో హత్య ఎవరు చేసారో తెలిసిపోతుంది. కానీ మా నాన్న హత్య కేసులో హత్య ఎవరు చేసారో ఐదేళ్లు అవుతున్నా తెలీడంలేదు. దర్యాప్తు ఆగిపోయింది. అది మళ్లీ త్వరగా ముందుకు సాగడానికి నాకు మీ సపోర్ట్ కావాలి అంటూ మీడియా ముందుకు వచ్చారు వైఎస్ సునీతా రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి ప్రజా తీర్పు కావాలి.
ఈ ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో ప్రజలకు తెలిస్తే ప్రజా తీర్పు వస్తుందని ఒక ఆశ. 2017లో ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో ఆయనను ఓడించాలని ప్రయత్నించారు. ఎందుకు? ఎందుకు ఓడిచాలనుకున్నారు? ఆయన్ను తప్పిస్తే ఎవరికీ అడ్డు ఉండదనా? సొంత వాళ్ల సహకారం లేకో మోసం చేయడం వలనో ఓడిపోయారు. దాంతో ఆయన తప్పుకుంటారు అనుకున్నారు. కానీ ఆయన డబుల్ స్ట్రాంగ్ అయ్యారు. ఆయనకు ఎక్కడి నుంచి ఎనర్జీ వచ్చిందో అర్థంకావడంలేదని చాలా మంది నాన్న గురించి నాతో చెప్పేవారు. దాంతో కొందరికి భయం ఎక్కువైంది. ఎంత అణచివేసినా ఆయన తగ్గడంలేదని భయపడ్డారు. అదే భయం మా నాన్న చావుకు కారణం అయ్యింది.
దురదృష్టవశాత్తు మాకు అప్పట్లో ఇదంతా అర్థంకాలేదు. ఇదంతా అర్థంకావడానికి మాకు చాలా సమయం పట్టింది. 2019 మార్చి 15న మా నాన్న చనిపోయారని తెలిసినప్పుడు ఆరోజు పులివెందులకు వెళ్లాక మేం వెళ్లిన మొదటి ప్రదేశం మార్చురీ. మార్చురీ బయట అవినాశ్ రెడ్డి నా వద్దకు వచ్చి పెద్దనాన్న 11:30 వరకు నాకోసం ప్రచారం చేస్తున్నారు అని చెప్పాడు. చాలా క్రిమినల్ కేసుల్లో మనం టీవీలో చూస్తుంటాం.. హంతుకులు మన మధ్యే ఉంటారు కానీ మనం పసిగట్టలేం. మాక్కూడా అదే జరిగింది. క్రిమినల్స్ మనకు సాయం చేస్తున్నప్పుడు వారే క్రిమినల్స్ అని మనకు తెలీదు. నాన్న కేసులో కూడా అదే జరిగింది.
11:30 వరకు కూడా నాన్న ప్రచారంలో ఉన్నారని నాకు చెప్పినప్పుడు.. అంతగా సాయం చేస్తున్న మా నాన్నను ఎందుకు చంపాలనుకుంటారు? సాయం చేసేవారిని ఎందుకు చంపాలని చూస్తారు. ఈ విషయం నాకు అర్థంకావడంలేదు. వివేకా హత్య కేసును ఇంతవరకు తేల్చలేకపోతున్నారు. సీబీఐ దర్యాప్తుకు వెళ్దామని జగన్‌ను అడిగా. సీబీఐకి వెళ్తే అవినాష్ బీజేపీకి వెళ్తారని అన్నారు. అరెస్టు, ఛార్జిషీటుకు ఏడాది సమయం పట్టింది. కేసు దర్యాప్తు ఎందుకంత ఆలస్యం జరుగుతుందో అర్థం కావట్లేదు. సీబీఐ పైనా కేసులు పెట్టడం మొదలుపెట్టారు. కేసు దర్యాప్తు అధికారులపైనే కేసులు పెట్టి భయపెట్టారు. నిందితులను పట్టుకోవడంలో ఇంత జాప్యం ఏ కేసులో లేదు. కర్నూలులో అవినాష్‌ను అరెస్టు చేయడానికి వస్తే ఉద్రిక్త వాతావరణం సృష్టించారు. అవినాష్ రెడ్డి అరెస్టు కోసం వెళ్లినప్పుడు కర్నూలులో ఏం జరిగిందో అందరికీ తెలుసు. సీబీఐ అరెస్టు చేయడానికి వెళ్లి వెనక్కి వచ్చిన సందర్భం ఎప్పుడైనా చూశామా?
వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తు ఇప్పటికీ అక్కడే ఉంది. నాకు ప్రజాకోర్టులో తీర్పు కావాలి. జరిగిన ఘటనలు ప్రజల ముందు ఉంచితే నాకు న్యాయం జరుగుతుంది. ముందు సీబీఐ విచారణకు ఆదేశించిన పిటిషన్‌కు ఎందుకు విత్ డ్రా చేసుకున్నారు? కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందే జగనన్న ఎందుకు విత్ డ్రా చేసుకున్నారు. శివశంకర్ రెడ్డి అరెస్టు తర్వాత మొత్తం కేసు మారిపోయింది. శివశంకర్ రెడ్డి అరెస్టు తర్వాత భయం మొదలైంది. అప్పటి నుంచే సీబీఐపై కేసులు పెట్టడం ప్రారంభించారు. విలువలు, విశ్వసనీయత పదే పదే అంటుంటారు. మాట తప్పను.. మడమ తిప్పను అంటుంటారు. మా నాన్న హత్య కేసులో ఇలాంటివి ఏమయ్యాయి?
వివేకాను చంపిన వారిని వదిలిపెడితే ఏం సందేశం వెళ్తుంది? మంచి, చెడుకు యుద్ధమంటున్నారు. ఏది కరెక్టో వాళ్లే చెప్పాలి. పేదలు, పెత్తందార్లకు మధ్య యుద్ధమంటున్నారు. న్యాయం కోసం ఐదేళ్లుగా పోరాడుతున్నా.. పట్టించుకోవట్లేదు సిబ్బందిపై కేసుల తర్వాత కడప నుంచి సీబీఐ అధికారులు వెళ్లిపోయారు. హైదరాబాద్‌కు కేసు బదిలీ అయిన తర్వాతే కేసు విచారణ ప్రారంభమైంది. హత్యా రాజకీయాలు ఉండకూడదు.
జగనన్న పార్టీ వైసీపీకి ఓటు వేయవద్దు
జగనన్న పార్టీ వైసీపీకి ఓటు వేయవద్దు. వంచన, మోసం చేసిన పార్టీకి ఓటు వేయవద్దు. తమ అనుకునే వాళ్లకే న్యాయం చేస్తారా? అవినాష్, భాస్కర్ రెడ్డి సీబీఐ విచారణలో ఉన్నారు. అవినాష్, భాస్కర్ రెడ్డిని అధికారంలో ఉన్నవాళ్లే రక్షిస్తున్నారు. జగన్ పాత్రపై విచారణ జరగాలి, నిర్దోషి అయితే వదిలేయాలి. జగన్ కేసుల వల్లే నాన్న హత్య కేసును సాగదీస్తున్నారు. సీబీఐపై ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నాయో నాకు తెలియదు. షర్మిల ఒక్కరే నాకు మొదటి నుంచి అండగా నిలిచారు. నాన్న హత్య కేసులో జగన్ పాత్రపై విచారణ జరపాలి. నాన్నను గొడ్డలితో చంపారు అనే విషయం జగనన్నకు ఎలా తెలుసు. జగనన్నకు ఎలా తెలుసో విషయం బయటికి రావాలి.
జగన్ తో భేటీ అయినప్పుడు.. ఆయన మాట్లాడిన విధానం చూసి అప్పుడు అనుమానించలేదు. సొంత కుటుంబం మీద ఎవరికీ అనుమానం రాదు. కానీ, ఒక్కో వాస్తవం బయటికి వస్తుంటే నమ్మాల్సి వచ్చింది. నా పైనే కేసులు పెట్టారంటే.. ప్రభుత్వం వెనుక ఉంది కాబట్టే పెట్టారు. అవినాష్ రెడ్డికి శిక్ష పడాలి.. పడుతుంది. తప్పు చేసినవారు తప్పించుకోకూడదు. అందరినీ అనుమానించాల్సిందే.. విచారించాల్సిందే. నన్ను విచారణ చేసినట్లే అందరినీ విచారణ చేయాలి. విచారణ త్వరగా పూర్తి చేసి దోషులను గుర్తించాలి అని వెల్లడించారు సునీతారెడ్డి.