EXCLUSIVE: టార్గెట్ 2029

EXCLUSIVE: నేను జ‌గ‌న్ అన్న వ‌దిలిన బాణాన్ని అంటూ అదే జ‌గ‌న్ అన్నకు గురిపెట్టేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో అడుగుపెట్టేసారు వైఎస్ ష‌ర్మిళ‌ (ys sharmila). కాంగ్రెస్ పార్టీతో చేతులు క‌లిపిన ష‌ర్మిళ ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ అధ్య‌క్షురాలి ప‌ద‌విలో ఉన్నారు.

మ‌రి ఇప్పుడు షర్మిళ ముందున్న స‌వాళ్లేంటి? ఏం చేయ‌బోతున్నారు? ఎటూ జ‌గ‌న్‌కు ప‌డాల్సిన ఓట్లు చీల‌బోతున్న సంగ‌తి స్ప‌ష్టంగానే క‌నిపిస్తోంది. క‌చ్చితంగా జ‌గ‌న్ ఓటు బ్యాంక్‌కు చిల్లు ప‌డ‌నుంది. ఇందులో సందేహ‌మేమీ లేదు. అయితే కాంగ్రెస్ ష‌ర్మిళ‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో దింపింది ఈ ఎన్నిక‌ల కోసం కాద‌ట‌. 2029 ఎన్నిక‌ల‌పై ఫోక‌స్ చేసేందుకు ఏపీలో కాంగ్రెస్ పేరు త‌ప్ప మ‌రే ఇత‌ర పార్టీ పేరు వినిపించ‌కుండా చేసేందుకు కాంగ్రెస్ ఇప్ప‌టినుంచి పావులు క‌దుపుతోంది. ఇందుకు ష‌ర్మిళ ఏం చేయ‌బోతున్నార‌నే అంశంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది.

15 శాతం ఓట్ల టార్గెట్

అయితే మ‌రో రెండు నెల‌ల్లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో షర్మిళ‌కు కాంగ్రెస్ ఇచ్చిన టార్గెట్ క‌నీసం 15 శాతం ఓట్లు. లేదా క‌నీసం 10 నుంచి 15 సీట్ల వ‌ర‌కు గెలవాల‌ని కాంగ్రెస్ టార్గెట్ పెట్టింది.

వారికి బాస‌ట‌గా కాంగ్రెస్

కొన్ని కార‌ణాల వ‌ల్ల చాలా మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల‌కు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి టికెట్లు నిరాక‌రించిన సంగ‌తి తెలిసిందే. వారిలో కొంద‌రు స‌రేలే క‌నీసం ఏదో ఒక పోస్ట్ వ‌స్తుంద‌ని పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవారు ఉన్నారు. ఇంకొంద‌రు YSRCP పార్టీని వీడి తెలుగు దేశం, జ‌న‌సేన‌ల్లో క‌లుస్తున్నారు. ఇక మూడో వ‌ర్గం వారు అటు TDP, ఇటు జ‌న‌సేన‌ (janasena), BJPలోకి వెళ్ల‌లేక స‌త‌మ‌త‌మ‌వుతున్న‌వారూ ఉన్నారు. ఈ మూడో వ‌ర్గానికి చెందిన‌వారికి కాంగ్రెస్ బాస‌ట‌గా నిలుస్తోంది. ఎటూ వెళ్ల‌లేని ప‌రిస్థితిలో ఉంటే మా పార్టీలోకి రండి అని ప‌బ్లిక్‌గానే ఆహ్వానిస్తున్నారు. ఇది ష‌ర్మిళ టార్గెట్‌కు ప్లాస్ పాయింట్‌గా మార‌నుంది.