YS Sharmila: KCR, మంత్రుల ప్రమేయం లేనిదే ఇది సాధ్యమైందా?
Hyderabad: BRS ప్రభుత్వం పనితీరు ఇది అంటూ ఎద్దేవాచేసారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ (ys sharmila). సర్వర్లు హ్యాకింగ్.. క్వశ్చన్ పేపర్స్ సెల్లింగ్.. హైటెక్ మాస్ కాపీయింగ్.. తొమ్మిదేండ్లుగా కేసీఆర్ దొర చేతిలో సాగిన TSPSC బోర్డు నిర్వాకమిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఎగ్జామ్ హాల్ లోకి సెల్ ఫోన్లు, మైక్రో చిప్స్, ఇయర్ బడ్స్ తీసుకెళ్తుంటే సెంటర్ల వద్ద సీఎం కేసీఆర్ (kcr) పోలీసులు ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. 24 గంటల నిఘా వ్యవస్థ నిద్రపోయిందా? కేసీఆర్, మంత్రుల ప్రమేయం లేనిదే ఇది సాధ్యమైందా? అని మండిపడ్డారు. ఈ మేరకు తెలంగాణ గవర్నర్ తమిళిసైకి (tamilisai) ఆమె ఓ రిక్వెస్ట్ పెట్టారు.
“లక్షలాది మంది యువత అప్పులు చేసి, తల్లిదండ్రులకు దూరంగా ఉండి, ఏండ్ల తరబడి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయితే.. వాళ్లకు ఇచ్చిన బహుమానం ఇదేనా? చాట్ జీపీటీతో బయటి నుంచి దర్జాగా సమాధానాలు పంపుతుంటే.. కేసీఆర్, TSPSC బోర్డు సిగ్గుతో తలదించుకోవాలి కదా? TSPSC ఐటీ డిపార్ట్ మెంట్ మొత్తం అవినీతిపాలైతే దానికి కారణమైన ఐటీ శాఖ అసమర్థ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలి కదా? కొలువుల కోసం నిరుద్యోగులు తెలంగాణ తెచ్చుకుంటే.. అదే నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టింది కేసీఆర్ ప్రభుత్వం. లక్షలాది యువత ఆకాంక్షలను బొందపెట్టింది. TSPSC బోర్డు అవినీతి, అక్రమాలు గ్రామాలకు పాకి.. ఖండాలు దాటినా చర్యలు లేవు. దొంగ చేతికే మళ్లీ తాళాలు ఇచ్చినట్లు పాత బోర్డుతోనే కేసీఆర్ మళ్లీ పరీక్షలు పెడుతున్నారు. సిట్ అధికారులకు గడీ బయట ఉన్న దొంగలు దొరుకుతున్నారు కానీ గడీ లోపల ఉన్న అసలు దొంగలు దొరకడం లేదా? నిరుద్యోగుల భవిష్యత్తు అంధకారంలో పడకుండా గౌరవ గవర్నర్ తమిళిసై స్పందించి, మీకున్న అధికారాలను ఉపయోగించి, రాష్ట్రపతికి సిఫారసు చేసి, TSPSC బోర్డును పునరుద్ధరించాలని మనవి” అని పేర్కొన్నారు.