YS Sharmila: అదే జరిగితే.. TDPలోకి షర్మిళ?
YS Sharmila: ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిళ తెలుగు దేశం పార్టీలో చేరతారా? కొన్ని పరిణామాలు చోటుచేసుకుంటే కచ్చితంగా అది జరిగే అవకాశం ఉందని క్లియర్‌గా తెలుస్తోంది. తన సోదరుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో విభేదాలు రావడంతో ఆంధ్రప్రదేశ్‌లో తన రాజకీయ భవిష్యత్తుకి గ్యారెంటీ ఉండదని భావించిన షర్మిళ.. తెలంగాణలో పార్టీ పెట్టి మరీ తన రాజకీయ భవిష్యత్తుకి స్వయంగా బాటలు వేసుకున్నారు. అయితే మళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గెలవకూడదు అని గట్టిగా నిర్ణయించుకుని దాని కోసమే పనిచేసిన షర్మిళ.. చివరికి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ ఎన్నికల్లో పోటీ చేయలేకుండా ఉండిపోయారు.
చివరికి ఆమె ప్రయత్నం ఫలించింది. కేసీఆర్ ఓడిపోయారు.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. దాంతో కాంగ్రెస్ హైకమాండ్ షర్మిళను ఢిల్లీకి పిలిపించుకుని కాంగ్రెస్‌తో చేతులు కలపాలని కోరింది. ఇందుకు షర్మిళ విధించిన కొన్ని షరతులకు కూడా కాంగ్రెస్ ఒప్పుకోవడంతో.. తెలంగాణకు గుడ్‌బై చెప్పేసి షర్మిళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టింది. అదే సమయంలో షర్మిళ అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లకు బొకేలు పంపి శుభాకాంక్షలు చెప్పడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామంగా చోటుచేసుకుంది. ఇప్పుడు ఏపీసీసీ చీఫ్‌గా ఓ పక్క జగన్ తాట తీస్తూనే మరోపక్క చంద్రబాబు నాయుడు చేస్తున్న తప్పులను ఎత్తిచూపుతున్నారు.
అయితే.. చంద్రబాబు నాయుడు ఆటవిక పాలన చేస్తున్నాడని ఆరోపించిన జగన్.. మొన్న ఢిల్లీకి వెళ్లి మరీ ధర్నా చేసారు. ఆయన ధర్నాలో ఇండియా కూటమికి చెందిన దాదాపు 8 పార్టీలు పాల్గొని మరీ మద్దతు తెలిపాయి. అయితే ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ మాత్రం మద్దతు తెలపలేదు. దాంతో జగన్ కాంగ్రెస్ పార్టీని విమర్శించారు. అప్పుడు షర్మిళ స్పందిస్తూ.. భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ఎలా మద్దతు ఇస్తుందని అనుకున్నావ్ అంటూ మండిపడింది.
ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే.. ఒకవేళ ఇండియా కూటమిలోకి వైఎస్సార్ కాంగ్రెస్ వెళ్తే మాత్రం షర్మిళ రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా మారుతుంది. ఎందుకంటే షర్మిళకు జగన్‌కు వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి. అలాంటప్పుడు కచ్చితంగా జగన్ ఉన్న చోట షర్మిళ ఉండలేరు. అదే పరిస్థితి వస్తే షర్మిళ జగన్‌ను ఓడించేందుకు తెలుగు దేశం పార్టీలో చేరేందుకు కూడా వెనుకాడరనే టాక్ బలంగా వినిపిస్తోంది.