YS Sharmila: బైబిల్ మీద ఒట్టేసి చెప్పన్నా.. షర్మిళ కంటతడి
YS Sharmila: APCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ కంటతడి పెట్టుకున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో నెపోటిజంకు దారి తీస్తుందనే తన చెల్లెలు షర్మిళకు పదవి ఇవ్వలేదని.. తనకు రాజకీయ కాంక్ష, డబ్బు ఆశ ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. దీనిపై షర్మిళ ప్రెస్ మీట్ పెట్టి స్పందించారు.
“” నన్ను అసలు రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఎవరు జగనన్నా? నువ్వు జైల్లో ఉంటే.. అదే సమయంలో చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తున్నాడని.. అతని గ్రాఫ్ పెరిగిపోతుందని నన్ను పాదయాత్ర చేయమన్నావ్. నా భర్త, పిల్లల్ని వదిలేసి బయటే నిద్రపోతూ నెలల పాటు కాళ్లు అరిగేలా తిరిగాను. కాలికి గాయం అయితే పాదయాత్ర ఆగిపోతుందేమో అని ఫిజియో థెరపీ చేయించుకుని మరీ పాదయాత్ర చేసాను. నాకే పదవి, డబ్బు ఆశ ఉండి ఉంటే.. నువ్వు జైల్లో ఉన్నప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మొత్తం నా వెంటే ఉంది.
అందరూ నేను చెప్పిందే విన్నారు. మరి నేను పార్టీని హైజాక్ చేసుండేదాన్ని కదా? అలా చేయలేదు. ఎందుకంటే నా తండ్రి అలా మోసం చేయడం నేర్పించలేదు. ఈరోజు నాకు పదవి ఇవ్వకపోవడానికి నెపోటిజం కారణం అని అంటున్నావ్. మరి నీ మేనమామ రవీందర్ రెడ్డి, సోదరుడు అవినాష్ రెడ్డి, బాబాయ్ సుబ్బారెడ్డిలకు ఎందుకు పదవులు ఇచ్చావ్? బైబిల్ మీద నాకు రాజకీయ, డబ్బు కాంక్షలు లేవు అని చెప్పగలను. నేను నిన్ను పదవి అడిగినట్లు బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పగలవా? “” అంటూ కన్నీరుమున్నీరయ్యారు.