YS Sharmila: లడ్డూ వివాదంపై FBIతో విచారణ చేయిద్దామా?
YS Sharmila: తిరుమల లడ్డూ వివాదంపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలిసారు APCC చీఫ్ వైఎస్ షర్మిళ. దీనిపై రిపోర్ట్ తెప్పించుకుని అన్ని విధాలుగా పరిశీలించి తన పరిధిలో ఉన్న రూల్స్ ద్వారా విచారణ జరిగేలా చూస్తానని గవర్నర్ మాటిచ్చినట్లు తెలిపారు. అయితే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఈ కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నారని.. మరి ఒక నెయ్యి ప్రొడక్ట్‌కు రెండు టెండర్లు వేయించి తక్కువ టెండర్‌కు ఎందుకు ఇచ్చారని షర్మిళ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు జగన్ సమాధానం చెప్పాలని అన్నారు. దీనికి సమాధానం చెప్పడం మానేసి తామే విచారణకు ఆదేశించడం ఏంటో తనకు అర్థంకావడంలేదని తెలిపారు. నెయ్యిలో కల్తీ ఉందని గుజరాత్ ల్యాబ్ రిపోర్టులు జులైలోనే వస్తే ఎందుకు చంద్రబాబు ఇప్పటివరకు దాచారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేసారు.
అయితే.. షర్మిళ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఓ విలేఖరి షర్మిళను ప్రశ్నిస్తూ.. మేడం.. ఈ తిరుమల లడ్డూ విషయంలో సీబీఐ విచారణ సరిపోతుందంటారా? లేక లోతుగా ఇంకేమన్నా చేయాలని మీరు అనుకుంటున్నారా? అని అడిగారు. ఇందుకు షర్మిళ.. ఎఫ్‌బీఐతో విచారణ చేయిద్దామా అని నవ్వుకుంటూ వెళ్లిపోయారు.