YS Bharathi: త్వరలో భారతి అరెస్ట్?
YS Bharathi: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (jagan mohan reddy) భార్య వైఎస్ భారతి రెడ్డి (ys bharathi reddy) త్వరలో అరెస్ట్ కానున్నారా? ప్రస్తుతానికి ఇదే ప్రచారంలో ఉంది.
దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. గత ఐదేళ్ల పాటు జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండటంతో ఆయన సీబీఐ అధికారులను కేసును దర్యాప్తు చెయ్యనివ్వకుండా అడ్డుకున్నారంటూ వివేకానంద కూతురు డాక్టర్ సునీతా రెడ్డి (ys sunitha reddy) ఆరోపించారు.
తన తండ్రిని చంపింది వైఎస్ భారతి రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డే అని ఆరోపిస్తూ ఆమె ఎన్నికల సమయంలో ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెట్టి మరీ తన దగ్గరున్న ఆధారాలతో సహా నిరూపించేందుకు ప్రయత్నించారు. కనీసం ప్రభుత్వం మారితే తన తండ్రి కేసు ఓ కొలిక్కి వచ్చి నిందితులకు శిక్ష పడుతుందని ఆశించారు. అనుకున్నట్లే జగన్ ప్రభుత్వం పోయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.
అయితే.. సునీతా రెడ్డి ఎన్నికల సమయంలో ఇలాంటి ప్రెస్‌మీట్లు పెట్టి సొంతింటి వారిపై ఇంతటి దారుణ ఆరోపణలు చేయడానికి కారణం చంద్రబాబు నాయుడే (chandrababu naidu) అని.. ఆయన చెప్పినట్లుగానే సునీత, APCC చీఫ్ వైఎస్ షర్మిళ (ys sharmila) ప్రవర్తిస్తున్నారని జగన్ అండ్ కో ఆరోపించారు.
బహుశా అందుకేనేమో సునీత చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మూడు నెలల తర్వాత తన తండ్రి కేసులో క్షేత్రస్థాయిలో దర్యాప్తు చేపట్టాలని హోం మంత్రి వంగలపూడి అనితను (vangalapudi anitha) కలిసారు. దాంతో ఈ కేసును రీఓపెన్ చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు, అనితల ఆదేశాల మేరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేషన్ అధికారులు త్వరలో భారతి రెడ్డిని అదుపులోకి తీసుకుని ఆమెతో విచారణ మొదలుపెట్టాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
2019 ఎన్నికల సమయంలో జగన్ వివేకానంద రెడ్డికి టికెట్ ఇవ్వాలనుకోగా.. భారతి రెడ్డి అవినాష్‌కు టికెట్ ఇవ్వాలనుకున్నారని.. ఈ పరిణామాలు వివేకా హత్యకు దారితీసాయని సునీత ఆరోపణలు చేస్తున్నారు. జగన్ అధికారంలోకి రాకపోయి ఉంటే సీబీఐ అధికారులు ముందు విచారణ భారతి రెడ్డితోనే చేసేవారని.. కానీ జగనే ముఖ్యమంత్రిగా ఉండటంతో తన భార్యపై ఈగ వాలనివ్వకుండా చేసారని సమాచారం.
భారతి వల్లే అవినాష్‌పై కూడా ఎలాంటి చర్యలు లేవని తెలుస్తోంది. ఇంత జరిగినప్పటికీ మొన్న జరిగిన ఎన్నికల్లో కడప ఎంపీగా అవినాష్ రెడ్డికే ప్రజలు పట్టం కట్టడం సంచలనంగా మారింది. ఇదే స్థానం నుంచి పోటీ చేసిన షర్మిళ హంతకులను గెలిపించుకుంటారో.. ఈ రాజశేఖర్ రెడ్డిని గెలిపించుకుంటారో మీకే వదిలేస్తున్నానంటూ ప్రచార సమయాల్లో ప్రజల ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు.
కానీ ఇలాంటివాటిని ప్రజలు నమ్మలేదు. అవినాష్‌నే గెలిపించారు. దాంతో అవినాష్ తన గెలుపును బ్రహ్మాస్త్రంలా వాడుకుంటున్నారు. తాను ఎటువంటి తప్పు చేయలేదు అని ప్రజలే తనను గెలిపించి మరీ నిరూపించారు అని వెల్లడించారు.