YCP On Yatra 2: అమరావతి కూడు పెడుతుందా?
YCP On Yatra 2: మహి వి రాఘవ్ (Mahi V Raghav) తెరకెక్కించిన యాత్ర 2 (Yatra 2) సినిమా చూసిన YCP నేతలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఉదయం మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) సినిమా చూసి కొన్ని భావోద్వేగపు సన్నివేశాలు తన గుండెను పిండేసాయని తన అభిప్రాయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇప్పుడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సినిమా చూసారట. సినిమా చూస్తుంటే బాహుబలి 2 చూస్తున్నట్లే ఉందని అన్నారు.
మరోపక్క రాజధాని అమరావతి అంశంపై వస్తున్న రాజధాని ఫైల్స్ అనే సినిమాపై మధుసూదన్ రెడ్డి స్పందించారు. అసలు ఆ సినిమా ఎందుకు తీస్తున్నారో ఇప్పటికీ అర్థంకావడంలేదని.. అమరావతి ఏమన్నా కూడు పెడుతందా అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రజలకు ఏం కావాలో అన్నీ చూసుకుంటున్నప్పుడ ఇక అమరావతి రాజధాని గురించి చర్చించాల్సిన అవసరం ఏముందని అన్నారు. ఏ జిల్లాను రాజధానిని చేస్తే ప్రజలకు ఏంటని.. వారికి కావాల్సింది హామీలు నెరవేర్చే ముఖ్యమంత్రి మాత్రమే అని అన్నారు. యాత్ర 2 సినిమా చూసిన ప్రజలు తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఎలాంటివాడో అర్థంచేసుకుని మళ్లీ జగన్ మోహన్ రెడ్డికే ఓట్లు వేస్తారని ధీమా వ్యక్తం చేసారు.
ఇక యాత్ర 2 సినిమా విషయానికొస్తే..ఎన్నో అంచనాల మధ్య ఈరోజు యాత్ర 2 (yatra 2 ) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు మహి వి రాఘవ్ (Mahi V Raghav) తన సత్తాను యాత్రతో నిరూపించేసుకున్నారు. పొలిటికల్ బయోపిక్ కాబట్టి ఇతర పార్టీలకు భయపడి ఎవ్వరినీ కించపరచకుండా తీయాలనుకునే టైప్ కాదని యాత్ర 2తో మరోసారి ప్రూవ్ చేసుకున్నారు రాఘవ్. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy) వారసుడిగా జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) 2019 ఎన్నికల సమయంలో చేసిన పాదయాత్ర నేపథ్యంలో యాత్ర 2 సినిమాను తెరకెక్కించారు రాఘవ్. మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి (Mammootty) రాజశేఖర్ రెడ్డి పాత్రలో.. తమిళ నటుడు జీవా (Jiva) జగన్ మోహన్ రెడ్డి పాత్రల్లో నటించారు. కాదు కాదు.. ఒదిగిపోయారనే చెప్పాలి. సినిమాకు అన్ని వైపుల నుంచి మంచి టాక్ వినిపిస్తోంది. చాలా మంది యాత్ర 2 సినిమాకు 3 స్టార్ నుంచి 5 స్టార్ వరకు రేటింగ్స్ ఇచ్చారు.
పవన్, జగన్ అభిమానుల గొడవ
యాత్ర 2 సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో జనసేనాని పవన్ కళ్యాణ్, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అభిమానుల మధ్య గొడవ జరిగింది. పవన్ అభిమానులపై జగన్ అభిమానులు దాడికి దిగడంతో దాదాపు 20 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు.
జగన్‌పై చెప్పు విసిరిన అభిమాని
మరోపక్క పవన్ కళ్యాణ్ అభిమాని ఒకరు.. జగన్ మోహన్ రెడ్డిపై చెప్పు విసిరాడు. పవన్ నటించిన కెమెరామ్యాన్ గంగతో రాంబాబు సినిమా రీరిలీజ్ అయిన సందర్భంగా కి సంబంధించిన యాడ్స్ వచ్చినప్పుడు ఓ అభిమాని చెప్పు విసరడం వైరల్‌గా మారింది. ఆ తర్వాత పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు కానీ పవన్ అభిమానులు రచ్చ చేయడంతో ఎన్నికల ముందు లా అండ్ ఆర్డర్ సమస్యలు వస్తాయని వార్నింగ్ ఇచ్చి వదిలేసినట్లు తెలుస్తోంది.