Gannavaram: గ్రూప్ రాజ‌కీయాలు.. TDPలోకి YCP నేత‌లు?!

AP: ఏపీలోనే కీలక నియోజకవర్గం గన్నవరం(gannavaram). ఇక్కడ TDP తరపున 2019లో వల్లభనేని వంశీ(vallabhaneni vamshi) ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే.. ఆ తర్వాత టీడీపీ నాయకుడు నారా లోకేష్‌(nara lokesh) తీరుతో ఆయన విభేదించి.. జగన్‌ చెంత చేరారు. దీంతో టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుకు (bachula arjunudu)బాధ్యతలు అప్పగించింది. ఇక ఇటీవల అర్జునుడు చ‌నిపోవ‌డంతో తాత్కాలికంగా నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలను బందరు మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణకు అప్పగించారు.

అయితే.. ఆయన ఒకవైపు బందరు పార్లమెంట్‌ను, మరోవైపు గన్నవరం నియోజకవర్గం బాధ్యతలు నిర్వర్తించాలంటే ఇబ్బంది పడుతున్నారు. ఎమ్మెల్యే వంశీని ఎలాగైనా ఓడించాలని టీడీపీ నాయకులు భావిస్తున్నారు. కానీ ఇప్ప‌టికీ సరైన ఇన్‌ఛార్జిని ఇప్పటివరకు నియమించకపోవడం గమనార్హం. ఈ విషయాన్ని కొందరు నాయకులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో టీడీపీ కొత్త ఇన్‌ఛార్జిని నియమించే పనిలో పడింది. ఇప్పుడు దీనిపై పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ పార్టీ కోసం గత ఎన్నికల్లో పనిచేసిన వ్యక్తికి గన్నవరం బాధ్యతలు అప్పగిస్తారని టాక్‌ నడుస్తోంది.

ఇప్పటికే అదే నియోజకవర్గంలో ఉంటున్న ఎమ్మెల్యే వంశీకి, వైసీపీ నాయకులు యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావుకి మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో దుట్టా లేదా.. యార్లగడ్డ.. కుదిరితే ఇద్దరూ పార్టీ మారతారని అనుకుంటున్నారు. అధిష్టానం సైతం వంశీకి మద్దతు ఇస్తుండటంతో వీరు గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారని సమాచారం. ఇక ఇటీవల దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ కూడా.. గన్నవరం వచ్చి.. పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీకి చెందిన నాయకులు కొందరు టచ్‌లో ఉన్నారని వారు గన్నవరం టిక్కెట్‌ అడుగుతున్నారని.. ఎంత డబ్బైనా ఖర్చు పెట్టేందుకు సిద్దంగా ఉన్నారని చెప్పి కాట్రవర్సీకి తెరలేపారు.