YCP @4 Years: పాలన ఇలా..!
AP: APలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (ycp) ముఖ్యమంత్రి అయ్యి నేటితో నాలుగేళ్లు పూర్తయ్యింది. ఈ నాలుగేళ్లలో కరోనా, ఆర్థిక ఇబ్బందులు వంటి సమస్యలు వచ్చినప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం సంక్షేమ పథకాలను అందిస్తూ సీఎం జగన్ ప్రజలకు దగ్గరవుతూ వస్తున్నారు. అసలు ఈ నాలుగేళ్ల పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం. AP విభజన అనంతరం 2014లో tdp అధినేత చంద్రబాబు తాను రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ ఆయన హయాంలో రాజధానితో పాటు, ప్రజలకు సంక్షేమం అందించలేకపోయారని ప్రజల నుంచి అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఘోరంగా ఓడిపోయారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొలి నుంచి సంక్షేమ పథకాలతో ప్రజలకు దగ్గరయ్యారు. అలా వైఎస్సార్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. ఆయన మరణం తర్వాత.. వైఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేసి.. అనేకమందికి చేరువయ్యారు. ప్రజల మధ్యనే ఉంటూ అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతు బలంగా వినిపించారు. ఎన్నికలకు ఏడాది ముందు.. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టి పథకాలను రూపొందించారు. వాటినే మేనిఫెస్టోగా ప్రకటించారు. ప్రజలు కూడా ఒక్క అవకాశం ఇద్దామని భావించి మద్దతు ఇవ్వాడంతో జగన్ భారీ విజయాన్ని కైవసం చేసుకున్నారు.
2019 జగన్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది నుంచి కరోనా మహమ్మారి వ్యాప్తి చెందింది. అయినప్పటికీ ఉద్యోగులకు జీతాలు, ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారు జగన్. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ అందిస్తున్నారు. ఇవి ఇప్పటికే కొన్ని వర్గాల ప్రజల్ని చాలా వరకు ప్రభావితం చేస్తున్నాయి. సంక్షేమ పథకాల పేరుతో జగన్ డబ్బులు పంచుతున్నారని ప్రతిపక్షాలు ప్రధానంగా ఆరోపిస్తున్నాయి. దీంతో పాటు రాష్ట్రంలో అభివృద్ది లేమి, నిరుద్యోగ సమస్య, నిత్యావసరాల ధరలు పెరిగాయని చెబుతున్నాయి. ఏదైనప్పటికీ.. రానున్న ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ మధ్య గట్టి పోటీ ఉంటుందనైతే చెప్పవచ్చు.