KK వెళ్లిపోతే KCR పరిస్థితేంటి? రాజకీయాలు వదిలేస్తారా?
KCR vs KK: భారత రాష్ట్ర సమితికి (BRS) ఏదో పీడకొట్టినట్లు అయిపోయింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన దగ్గర్నుంచి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. రోజుకో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే, ఎంపీ పార్టీకి గుడ్‌బై చెప్పేసి కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీల్లో చేరిపోతున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు వెళ్లిపోతుంటే తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత KCR.. వెళ్లిపోతే మళ్లీ పార్టీలోకి రానిచ్చేది లేదని.. పార్టీలోనే ఉంటు భవిష్యత్తులో వారికే మంచి జరుగుతుందని అన్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలు వెళ్తే వెళ్లారు.. కానీ కేసీఆర్‌కు మంచి స్నేహితుడు, సలహాదారుడు, ఎంపీ అయిన కేకే అలియాస్ కేశవరావు పార్టీని వీడనున్నారు. ఇది పార్టీకి పెద్ద గండమే అని చెప్పాలి. ఎందుకంటే కేసీఆర్‌కు ఇది తప్పు అని చెప్పగలిగే ధైర్యం ఉన్న ఏకైక వ్యక్తి పార్టీలో ఎవరైనా ఉన్నారంటే అది కేశవరావే.
తెలంగాణ భవన్‌లో కేసీఆర్ ఛాంబర్ పక్కన కేటీఆర్‌కు కానీ హరీష్‌రావుకి కానీ ఛాంబర్ లేదు. అలాంటిది కేశవరావుకి మాత్రమే ఉందంటే పార్టీలో కేశవరావుకి ఉన్న ప్రాముఖ్యత ఎలాంటిదో అర్థమవుతోంది. అలాంటి కేశవరావు పార్టీలో లేకపోతే ఇక పార్టీ కనుమరుగైపోతుందేమో అనే టాక్ నేతల్లో వినిపిస్తోంది. ఇప్పుడు కేశవరావుకి పార్టీతో వచ్చిన గొడవేంటి అంటే.. పార్టీలో కేసీఆర్ కుటుంబీకులు, మరో నలుగురు నేతలకు తప్ప మిగతావారికి సమానమైన గౌరవం కానీ అవకాశాలు కానీ లేవని కేశవరావు బాధపడుతున్నారు. తనకు కూడా పార్టీలో ఇప్పుడు గౌరవం లేదని చెప్తున్నారు. అందుకే కాంగ్రెస్‌లో చేరాలనుకుంటున్నట్లు తెలిపారు. 40 ఏళ్ల పాటు తన ప్రయాణం కాంగ్రెస్‌తోనే జరిగిందని.. కేవలం పదేళ్లు మాత్రమే భారత రాష్ట్ర సమితితో ఉన్నానని తెలిపారు. తెలంగాణ కోసమే భారత రాష్ట్ర సమితిలో చేరాను కానీ నిజానికి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ కాబట్టి మళ్లీ సొంత గూటికి వెళ్లాలనుకుంటున్నట్లు తెలిపారు.
ఈసారి జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి ఓడిపోతుందని.. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ తర్వాత స్థానంలో భారత రాష్ట్ర సమితి నిలవబోతోందని కేశవరావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ సమయంలో కూడా కేసీఆర్ అనవసరంగా డిజైన్ విషయంలో జోక్యం చేసుకున్నారని ఎవరి పని వారు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. పార్టీలో జరుగుతున్న పెను మార్పుల గురించి తాను కేసీఆర్‌కు వివరించినా ఆయన వినే పరిస్థితిలో లేరని కేశవరావు బాధపడ్డారు.
KCR పరిస్థితి ఏంటి?
మరి కేశవరావు లేకపోతే కేసీఆర్ లేరా? కేశవరావు కాంగ్రెస్ గూటికి చేరితే కేసీఆర్ రాజకీయాలను వదిలేస్తారా? అనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. కేశవరావు కేసీఆర్‌కు మంచి సలహాదారుడు. ఎంత గొప్ప మనిషైనా సరే.. పక్కనే తప్పు ఒప్పుల గురించి చెప్తూ నడిపించే ఓ వ్యక్తి ఉండి తీరాల్సిందే. లేదంటే ఆ మనిషి తన ఉనికినే కోల్పోతాడు. ఇప్పటికైనా కేసీఆర్ మేల్కొని తన చుట్టూ ఏం జరుగుతుందో గమనించి అనుకూలంగా మసులుకుంటే తెలంగాణలో భారత రాష్ట్ర సమితి బతికే ఉంటుంది. లేదంటే దాని ఉనికే పోయే ప్రమాదం ఉంది.