AP Elections: కూటమి గెలిస్తే.. మేనిఫెస్టోలో మార్పులు?
AP Elections: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి (తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ) అధికారంలోకి వస్తే ఉమ్మడి మేనిఫెస్టోలో మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. కన్నడనాట కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఈ పథకం మూల కారణంగా మారింది.
ఆ తర్వాత అదే పథకాన్ని తెలంగాణ ఎన్నికల్లో కూడా ప్రవేశపెట్టడంతో తెలంగాణలోనూ విజయం సాధించింది. ఇప్పుడు లోక్ సభ ఎన్నికలు జరుగుతుండడంతో కాంగ్రెస్ పోటీ చేస్తున్న ఇతర రాష్ట్రాల్లోనూ ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలని చూస్తోంది. దాంతో ఈ పథకాన్ని ఇప్పుడు తెలుగు దేశం, జనసేన పార్టీలు ప్రకటించిన మేనిఫెస్టోలో కూడా ప్రస్తావించారు. కూటమి అధికారంలోకి వస్తే ఏపీలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేస్తామని అన్నారు.
అయితే ఈ పథకం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ఏమాత్రం సబబుగా లేరు. దీనిని కాంగ్రెస్ ప్రవేశపెట్టి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలు చేస్తుంటేనే ఆయన మండిపడ్డారు. దీని వల్ల ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని.. మెట్రో రాబడి ఉండదని అన్నారు. ప్రతి ఐదేళ్లకోసారి బస్సుల మెయింటైనెన్స్ కోసం కోట్లు ఖర్చు అవుతాయని.. ఉచిత బస్సు ప్రయాణం ద్వారా రాబడి లేకపోతే ఆ ఖర్చు ఎలా భరిస్తారని ఆయన పలుసార్లు ప్రశ్నించారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోని మార్చే హక్కు ప్రధానికి లేదు కానీ.. కూటమి మేనిఫెస్టోలో మార్పులు చేసే అవకాశం ఆయనకు ఉంది. కాబట్టి కూటమి అధికారంలోకి వస్తే ఈ ఉచిత పథకాల విషయంలో మార్పులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.