రుషికొండకు 151 అడుగుల స్టిక్కర్ వేస్తారా?
vijayawada: వైజాగ్‌లోని రుషికొండ(rushikonda) వద్ద జరుగుతున్న అక్రమ తవ్వకాలపై జనసేనాని పవన్ కల్యాణ్(pawan kalyan) తనదైన స్టైల్లో స్పందించారు. వాస్తవానికి రుషికొండ వద్ద చేపడుతున్న తవ్వకాలపై ప్రతిపక్షపార్టీలు తీవ్ర స్థాయిలో YCPపై ఎప్పటి నుంచో ఆరోపణలు చేస్తున్నాయి. దీనిపై పలుమార్లు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో అయిదుగురు బృందం సభ్యులు ఇటీవల రుషికొండను సందర్శించారు. అనేక వివరాలను సేకరించిన నిపుణుల కమిటీ.. రుషికొండ వద్ద అక్రమ మైనింగ్ జరిగిందని.. నిబంధనలను ఉల్లంఘించారని తేల్చింది. దీనిపై ప్రతిపక్షాలు.. YCP పార్టీపై భగ్గుమన్నాయి. ఈనేపథ్యంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. నిబంధనలు ఉల్లంఘించారని నిపుణుల కమిటీ తేల్చి చెప్పిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. సమాధానం చెబుతుందా, లేక రుషికొండపై గ్రీన్ మ్యాట్ వేసినట్లుగా.. 151 అడుగుల జగన్‌మోహన్ రెడ్డి(jagan) స్టిక్కర్ అంటిస్తుందా అని కౌంటర్ వేశారు. చెట్లను నరికేయడం, కొండలు, గుట్టలను ఆక్రమించడం, తీరప్రాంతాలు, మడ అడవులను పాడు చేయడం వైసీపీ నాయకుల లక్షణం అంటూ పవన్ ఆరోపించారు. . రుషికొండను ధ్వంసం చేయడంలో వైసీపీ ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందని, ఇది ప్రతిపక్షాల ఆరోపణ కాదని, ఐదుగురు సభ్యుల నిపుణుల ప్యానెల్ నిర్ధారించిందని ఆంగ్ల పత్రిక పేపర్ కటింగ్‌ను తన ట్విట్టర్ ఖాతాలో పవన్ షేర్ చేశారు. దీనికి వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
గతంలో ఇలా..
విశాఖ రుషికొండ ప్రాంతంలో ప్రకృతిని వైసీపీ నాశనం చేస్తోందని పవన్ గతంలోనే ఆరోపించారు. తన పర్యటనలో భాగంగా డ్రోన్ ఎగురవేసి అక్కడి ప్రస్తుత పరిస్థితిని ప్రజలకు చూపిద్దామనుకుంటే… వైసీపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వకుండా పోలీసులు పంపిందన్నారు. రుషికొండ ప్రస్తుత పరిస్థితులపై పలు ఆధారాలతో ఓ వీడియోను కూడా ఆయన అప్పట్లో విడుదల చేశారు.