BJP గెలుపు మంత్రం ఈసారీ గెలిపిస్తుందా?
1990ల నుంచి BJP చేపట్టే యాత్రలతో గెలిస్తూ వచ్చింది. వారు చేసే యాత్రలతోనే విజయ దుందుభిని మోగిస్తూ వచ్చింది. మరి ఈసారి కూడా ఇదే విజయ మంత్రం వారిని గెలిపిస్తుందా? రానున్న లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లో తమ ప్రభుత్వాన్ని నిలబెట్టాలని అనుకుంటోంది BJP. ఇందుకోసం పెద్ద స్థాయిలో యాత్రలు చేపట్టాలని చూస్తోంది. ఇప్పటికే మధ్యప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో జన్ ఆశీర్వాద్ యాత్ర మొదలుపెట్టేసింది. ఈ యాత్రలో 210 నియోజకవర్గాల్లో పర్యటించాలని ప్లాన్ వేసింది. దాదాపు 18 రోజుల పాటు ఈ యాత్ర జరగనుంది.
ఈ యాత్రలో భాగంగా 1000 సమావేశాలు, 600 రథయాత్రలు, 250 స్టేజ్ మీటింగ్‌లు, 50 భారీ జన సభలు నిర్వహించాలని చూస్తోంది. యాత్ర రథంపై 12 ముఖ్య నేతల పోస్టర్లను అంటించనున్నారు. ఈ యాత్రల వల్లే BJPకి పబ్లిక్ పల్స్ బాగా తెలుస్తోంది. 1990లో రామ రథ యాత్ర, 1993లో ఏక్తా యాత్ర BJPకి అధికారాన్ని తెచ్చిపెట్టాయి. 1996లో BJP నుంచి మొదటి వ్యక్తి దేశానికి ప్రధాని అయ్యారు. 1997లో BJP గోల్డెన్ జూబ్లీ యాత్ర నిర్వహించినప్పుడు 1998లో జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయ దుందుభిని మోగించింది. ఇప్పుడు రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లోనూ (lok sabha elections) ఈ యాత్రే తమను అధికార కుర్చీపై కూర్చోపెడుతుందని BJP ధీమా వ్యక్తం చేస్తోంది.