YCP, జనసేన మధ్య ఫ్లెక్సీల వార్.. TDP సైడ్ అయిపోయిందిగా!
vijayawada: ఆంధ్రప్రదేశ్‌లో ఫ్లెక్సీల వార్ కొనసాగుతోంది. ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి చిత్రంతో రిచ్ వర్సెస్ పూర్ అని రాష్ట్ర వ్యాప్తంగా YCP నాయకులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అందులో చంద్రబాబు ఒకవైపు పల్లకీలో కూర్చుని ఉంటారు. ఆయన పల్లకీని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, ఈనాడు రామోజీ, ఏబీఎన్ రాథాకృష్ణ, టీవీ-5 బీఆర్ నాయుడు వంటి పలువురు మోస్తు ఉంటారు. మరోవైపు సీఎం జగన్ పేదల పక్షాన ఉన్నట్లు .. చంద్రబాబు, పెత్తందారులు రాకుండా పేదలకు రక్షించే మెస్సయ్య జగన్ అని అర్థం తీసుకొచ్చేలా ఆ ఫ్లెక్సీలను వేశారు. అయితే.. ఈ ఫ్లెక్సీలను తొలుత నందమూరి బాలకృష్ణ నియోజకవర్గం హిందూపూర్‌లో టీడీపీ నాయకులు చించేశారు. అనంతరం జనసేన నాయకులు ఆ ఫ్లెక్సీలను ఎక్కడికక్కడ చింపుతూ వస్తున్నారు.
జనసేనకు అంత కోపం ఎందుకంటే..
సీఎం జగన్ పవన్ కల్యాణ్ పేరు కూడా ఎప్పుడూ ప్రస్తవించారు. ఇటీవల కూడా అనేక బహిరంగ సభల్లో దత్తపుత్రుడు అని సంభోదిస్తూ వస్తున్నారు. ఈవిషయంలో జనసేన నాయకులు జగన్ పట్ల కొంత కోపంగా ఉన్నారు. ఈక్రమంలో సీఎం జగన్ చిత్రంతో వేసిన ఫ్లెక్సీలలో చంద్రబాబు పల్లకీని పవన్ మోస్తున్నట్లు ఫొటోలను వేశారు. దీంతో జనసేన శ్రేణుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. ఇక ఒంగోలులో జనసేన నాయకులు సైతం వైసీపీకి పోటీగా జగన్‌ను ట్రోల్ చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అందులో జగన్ చొక్కాపై ఖైదీ నంబర్ 6073 అని, పవన్ బాణంతో ఆయన వైపు సంధిస్తున్నట్లుగా ఫ్లెక్సీలు వేశారు. దీంతో జనసేన, వైసీపీ నాయకుల మధ్య ఘర్షణలు చోటుచేసుకుంటున్నాయి. విశాఖ, ఒంగోలు, నెల్లూరు జిల్లా నాయుడుపేట, పాలకొల్లులో జనసేన పార్టీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు రెండు పార్టీల వర్గాల మధ్య వివాదానికి దారితీశాయి. పలు ప్రాంతాల్లో ఇరు పార్టీల నేతలు బాహాబాహికి దిగారు. ఆ పంచాయితీలు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాయి.