Senthil Balaji: ఎందుకు తీసేసారు.. మళ్లీ ఎందుకు ఉంచారు?
Chennai: తమిళనాడులో అనూహ్యమైన సంఘటన చోటుచేసుకుంది. వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న DMK మంత్రి సెంథిల్ బాలాజీని (senthil balaji) క్యాబినెట్ నుంచి తొలగిస్తున్నట్లు ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ ఎన్ రవి (rn ravi) ఉత్తర్వులు జారీ చేసారు. ఈడీ అరెస్ట్ వల్ల గుండెపోటుకు గురైన సెంథిల్ బాలాజీకి (senthil balaji) ఇటీవల బైపాస్ సర్జరీ జరిగింది. ఆయన కోలుకున్నాక పోలీసులు రిమాండ్‌కు తరలించనున్నారు. ఇప్పుడు ఆయన ఏ శాఖకూ మంత్రి కాదు. అలాంటప్పుడు ఆయన్ను మంత్రిగా ఎందుకు పరిగణించాలి అంటూ ఆర్ ఎన్ రవి ప్రశ్నిస్తూ.. సెంథిల్ బాలాజీని డీఎంకే మినిస్టర్ కేబినెట్ నుంచి తొలగిస్తున్నట్లు నిన్న నోటీసులు జారీ చేసారు.
అయితే ఉన్నట్టుండి ఏం జరిగిందో ఏమో కానీ.. సెంథిల్ బాలాజీని తొలగించిన ఐదు గంటల్లోనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్.ఎన్ రవి ప్రకటించారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో చర్చించాక రవి ఈ ప్రకటన విడుదల చేసారు. ఇది సరైన పద్ధతా కాదా అని తెలుసుకునేందుకు అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని తెలుసుకున్నాక ఫైనల్ నిర్ణయం ప్రకటిస్తామని రవి తెలిపారు. అసలు ఒక పార్టీకి చెందిన మంత్రిని తొలగించే హక్కు ఆ పార్టీ హైకమాండ్‌కి లేదా కేంద్రానికి ఉంటుంది కానీ గవర్నర్‌కు ఎలాంటి హక్కు ఉండదు. అలాంటప్పుడు ఎవరితోనూ ఎలాంటి సంప్రదింపులు జరపకుండా గవర్నర్ ఇలాంటి ప్రకటనను ఎలా చేస్తారు అని తమిళనాడు ముఖ్యమంత్రి, DMK అధినేత ఎంకే స్టాలిన్ (mk stalin) మండిపడుతున్నారు.