PV Narasimha Rao: రాజకీయాలు వదిలేయాలనుకుని.. ప్రధానిగా మారి..!
PV Narasimha Rao: తెలంగాణ బిడ్డ అయిన దివంగత మాజీ భారత ప్రధాని పి.వి నరసింహారావుకు (PV Narasimha Rao) కేంద్ర ప్రభుత్వం అత్యున్నత భారతీయ పురస్కారం అయిన భారతరత్నను (Bharat Ratna) ప్రకటించింది. కేంద్రం నిర్ణయం పట్ల దాదాపు అన్ని పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. నరసింహారావు 1991లో భారతదేశ ప్రధాని అయ్యారు. అయితే ఆయన ప్రధాని అవ్వడానికి కొన్ని నెలల ముందే ఈ రాజకీయాలు ఓ దండం అని అక్కడితో తన రాజకీయ జీవితానికి స్వస్తిపలకాలని అనుకున్నారు.
ఢిల్లీలోని తన కార్యాలయంలో ఉన్న వస్తువులన్నీ సర్దేసుకుని వాటిని తన రెండో కుమారుడితో హైదరాబాద్‌లో ఉన్న నివాసానికి పంపించేసారు. తమిళనాడుకి చెందిన ఓ మఠానికి అధిపతిగా ఉండాలని అనుకున్నారు. అప్పటికే ఆయనకు తమిళనాడు మఠం నుంచి పిలుపు వచ్చినా ఆ ఆఫర్‌ను హోల్డ్‌లో పెట్టారు. ఆ తర్వాత రాజకీయాలు వద్దనుకుని మఠాధిపతిగా ఉండాలని నిర్ణయించుకున్నారు. 1990లో అప్పటి కాంగ్రెస్ చీఫ్ రాజీవ్ గాంధీ (Rajiv Gandhi) లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ గెలిస్తే క్యాబినెట్‌లో ఉన్న తలనెరిసిన వారిని తీసేసి యంగ్‌స్టర్స్‌కి అవకాశం ఇస్తానని ప్రకటించారు.
అప్పుడే ఇక తనకు పార్టీలో పనిలేదన్నమాట అని అనిపించి రాజకీయాలకు స్వస్తి పలకాలని పీవీ నరసింహారావు అనుకున్నారు. వరసగా 8 సార్లు గెలిచిన నరసింహారావుకి అంత అనుభవం ఉండి కూడా ఇంకా చేయి చాచి అడగాల్సిన అవసరం లేదని అనుకున్నారు. 1991లో రాజీవ్ గాంధీ మరణించిన నేపథ్యంలో నరసింహారావు రాజకీయ జీవితమే మారిపోయింది. రాజీవ్ గాంధీ ఇక లేరని తెలుసుకున్న రావు కొన్ని గంటల్లోనే ఆయన పార్ధివదేహానికి నివాళులు అర్పించేందుకు జన్‌పథ్ వెళ్లారు. అదే సమయంలో అక్కడే ఉన్న దివంగత నేత ప్రణబ్ ముఖర్జీ (pranab Mukherjee) రావుని వెంటనే పక్కకు తీసుకెళ్లి రాజీవ్ లేరు కాబట్టి ఆయన స్థానాన్ని మీకు ఇవ్వాలని చర్చ జరుగుతోంది అని చెప్పారట.
ఇందుకు రావు కూడా సంతోషించారు కానీ ఆ సమయంలో ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయారు. 1984లో ఇందిరా గాంధీ హత్యకు గురైన తర్వాత ఆమె స్థానం తనదే అన్నట్లు ప్రణబ్ ముఖర్జీ అందరినీ నమ్మిస్తూ ఉండేవారు. ఈ విషయం నరసింహారావు దృష్టికి రావడంతో పార్టీ హైకమాండ్ చెప్పినట్లు నడుచుకుంటే బాగుంటుంది ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటే మంచిది అన్నట్లు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారట. కాంగ్రెస్ చీఫ్‌గా ఎవర్ని ఎంపిక చేయాలా అని సోనియా గాంధీ ఆలోచిస్తుండగా కొందరి పేర్లు తన పరిశీలనకు వచ్చాయి.
వారిలో ఎన్డీ తివారీ పేరు కూడా ఉన్నప్పటికీ.. రాజీవ్ గాంధీ మాట కాదని లోక్ సభ ఎన్నికల్లో తివారీ పోటీ చేసి పార్టీని మోసం చేసారని అతన్ని పక్కన పెట్టారు. అందరి పేర్లు పరిశీలించగా పి.వి నరసింహారావు అయితేనే బాగుంటుందని భావించి సోనియా నరసింహారావుని కాంగ్రెస్ చీఫ్‌గా ప్రకటించింది.నరసింహారావుకి ఎవ్వరితోనూ శత్రుత్వం లేదని ఆయన్ను కాకుండా ఇతరులను కాంగ్రెస్ చీఫ్‌గా నియమిస్తే పార్టీని చీలుస్తారని ఇందిరా గాంధీ ప్రిన్సిపల్ సెక్రటరీ పీఎన్ హక్సర్ కూడా అభిప్రాయపడ్డారట. అలా నరసింహారావు కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు తీసుకుని ముగించాలనుకున్న తన రాజకీయ ప్రయాణాన్ని పునఃప్రారంభించారు.