KCR అసెంబ్లీకి ఎందుకు వెళ్లడం లేదు? కారణం అదేనా?
KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి KCR కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. కొన్ని నెలల క్రితం తన ఇంట్లో కాలు జారి కిందపడటంతో ఆయనకు తుంటి ఎముక విరిగింది. సర్జరీ జరగడంతో నెల రోజుల పాటు హాస్పిటల్‌లో ఉన్నారు. కాస్త కోలుకున్నాక ఇటీవల అసెంబ్లీలో గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసారు. ప్రమాణ స్వీకారం చేసాక మళ్లీ కేసీఆర్ అసెంబ్లీ ముఖం చూసింది లేదు. మరోపక్క కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలో BRS తప్పుల చిట్టా.. అక్రమాల పట్టా అంటూ ప్రెజెంటేషన్‌లు వేసి మరీ BRS అవినీతిని బయటపెడుతున్నారు.
ఈ నేపథ్యంలో KCR గురించి కాంగ్రెస్ నేతలు అనరాని మాటలు అంటున్నారు. KCR అసెంబ్లీకి అయితే రాలేదు కానీ నల్గొండలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభకు మాత్రం ఎలాగోలా హాజరయ్యారు. దాంతో కాంగ్రెస్ నేతలకు ఇంకా ఒళ్లు మండింది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం ఇష్టం లేకనే కేసీఆర్ అసెంబ్లీకి రావడంలేదని.. కాంగ్రెస్ అధికారంలో ఉంటే చూసి తట్టుకోలేక తప్పించుకుని తిరుగుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. వారు చేసే కామెంట్స్‌కి BRS పార్టీ నేతలు అంతే ధీటుగా ప్రతి స్పందనలు ఇస్తున్నారు.
కేసీఆర్‌ను నోటికొచ్చినట్లు తిడుతున్నారన్న కారణంతోనే నిన్న అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి అసెంబ్లీ బయట ధర్నాకు దిగారు. ఇలా అధికారంలో ఉన్న వారు నోరుజారి ఎలా పడితే అలా మాట్లాడితే సహించేది లేదని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ KTR మండిపడ్డారు. నిన్న జరిగిన నల్గొండ సభలో కేసీఆర్ చాలానే డైలాగులు చెప్పారు. తన ప్రాణం పోయినా తెలంగాణకు నష్టం కలగనివ్వను అంటూ పెద్ద పెద్ద డైలాగులు చెప్పారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. నల్గొండ సభలో కేసీఆర్ లేవనెత్తిన అంశాలు కృష్ణా నదీ జలాలు, కాళేశ్వరం, మేడిగడ్డ బ్యారేజీ. మరి ఇవే అంశాల గురించే కదా అసెంబ్లీలో కాంగ్రెస్ నేతలు కూడా బల్ల గుద్ది మరీ చర్చిస్తున్నారు. అలాంటప్పుడు వారు అడిగే ప్రశ్నలకు ధైర్యంగా ప్రధాన ప్రతిపక్ష నేత స్థానంలో ఉండి అసెంబ్లీలో సమాధానం చెప్పకుండా నల్గొండలో ప్రజల మధ్యకు వెళ్లి చెప్పుకుంటే ఏం లాభం?
అసెంబ్లీకి అనే కాదు.. KCR అధికారంలో ఉన్నప్పుడు సచివాలయానికి కూడా వెళ్లేవారు కాదు. ఇదివరకు భారత రాష్ట్ర సమితి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కేసీఆర్ సీఎంగా సచివాలయానికి కానీ అసెంబ్లీకి కానీ రాకపోయినా నిలదీసే వారు లేరు. కానీ ఇప్పుడు అలా కాదు. ప్రభుత్వం మారింది. అధికారం వేరొకరి సొంతం అయింది. ఇప్పుడు కచ్చితంగా నిలదీస్తారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి.. తీరా తెలంగాణ సమస్యల గురించి పెద్ద దిక్కుగా సూచనలు చేయడానికి సలహాలు ఇవ్వడానికి అసెంబ్లీకి రాకపోతే ఎలా అని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ అసెంబ్లీకి రాకపోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
మేడిగడ్డ బ్యారేజీ గురించి కృష్ణా జలాల వివాదం గురించి తమకు కేసీఆర్‌తో చర్చించాలని ఉందని అందుకు వీలుగా ఉన్న ఏకైక వేదిక అసెంబ్లీ మాత్రమే అని రేవంత్ అన్నారు. అలాంటిది ఆయన అసెంబ్లీకి రాకుండా బయట ఎక్కడికో వెళ్లి సభలు పెట్టి తమ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఎలా ఊరుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారి కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోయారు. అసెంబ్లీలో స్పీకర్‌కి కుడి వైపున కూర్చోవాల్సిన తాను ఎడమ వైపున కూర్చుని ఎప్పుడు మాట్లాడేందుకు అవకాశం ఇస్తారా అని ఎదురుచూడటానికి కేసీఆర్ సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ కేసీఆర్ అసెంబ్లీకి రాకపోవడం వల్ల కాంగ్రెస్‌కు మరింత బలం చేకూరుతోంది. ఈ సాకుతో BRS పార్టీపై మరిన్ని ఆరోపణలు కామెంట్స్ చేస్తూనే ఉంటారు.