Kavitha Arrest: క‌విత‌ను స‌డెన్‌గా ఎందుకు అరెస్ట్ చేసారు?

Kavitha Arrest: భార‌త రాష్ట్ర స‌మితి  (BRS) ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను (Kalvakuntla Kavitha) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ED) ఈరోజు సెడ‌న్‌గా అరెస్ట్ చేసింది. ఢిల్లీ లిక్క‌ర్ స్కాంలో (Delhi Liquor Scam) పాలుమార్లు క‌విత సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్‌వెస్టిగేష‌న్ (CBI), ఈడీ పంపుతున్న నోటీసుల‌కు స్పందించ‌కుండా.. విచార‌ణ‌కు హాజ‌రుకాకుండా ఉన్న నేప‌థ్యంలో ఉన్న‌ట్టుండి ఈడీ అధికారులు ఈరోజు క‌విత ఇంటిపై దాడులు చేసారు. ఉద‌యం ర‌హ‌స్యంగా క‌విత ఇంట్లోకి ప్ర‌వేశించి ఆమె ఫోన్లు.. ఇంట్లో ప‌నివాళ్ల ఫోన్ల‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ త‌ర్వాత అరెస్ట్ వారెంట్ చూపించి క‌విత‌ను అరెస్ట్ చేసారు. ప్ర‌స్తుతం క‌విత‌ను శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి త‌ర‌లించారు. అక్క‌డి నుంచి రాత్రి 8:45కి ఉన్న ప్ర‌త్యేక విమానంలో ఢిల్లీకి త‌ర‌లించి స్కాం గురించి విచారణ చేయ‌నున్నారు. (Kavitha Arrest)

క‌విత భ‌ర్త అనిల్ కుమార్‌కి క‌విత‌ని అరెస్ట్ చేస్తున్న‌ట్లు ఈడీ అధికారులు స‌మాచారం నోటీసులు ఇచ్చారు. ఆ త‌ర్వాత భార‌త రాష్ట్ర స‌మితి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హ‌రీష్ రావు క‌విత ఇంటికి వెళ్లారు. కోర్టులో అరెస్ట్ చేయం అని చెప్పి కౌంట‌ర్ వేసి ఇక్క‌డికి వచ్చి అరెస్ట్ ఎలా చేస్తారు అని కేటీఆర్.. ఈడీ మ‌హిళా జాయింట్ డైరెక్ట‌ర్ మీనాతో గొడ‌వ‌ప‌డ్డారు. మొత్తం మీద క‌విత‌ని ఢిల్లీకి త‌ర‌లిస్తున్నారు.

రేపో ఎల్లుండో లోక్ స‌భ ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వెలువ‌డ‌నున్న నేప‌థ్యంలో క‌విత‌ను తెలంగాణ కాంగ్రెస్, కేంద్ర ప్ర‌భుత్వం క‌లిసి క‌విత‌ను ప్లాన్ ప్ర‌కారం అరెస్ట్ చేయించిన‌ట్లు తెలుస్తోంది. కావాల‌నే శుక్ర‌వారం అరెస్ట్ చేసార‌ని.. శ‌నివారం, ఆదివారాల్లో కోర్టుల‌కు సెల‌వు ఉంటాయ‌నే తెలిసే శుక్ర‌వారం అరెస్ట్ చేసార‌ని KTR ఆరోపించారు.

రేపు సుప్రీం కోర్టులో క‌విత చాలెంజ్ పిటిష‌న్

త‌న అరెస్ట్‌ను స‌వాల్ చేస్తూ రేపు సుప్రీంకోర్టు క‌విత‌ పిటిష‌న్ వేయ‌నున్నారు. తాను ముందు వేసిన పిటిష‌న్ ఇంకా సుప్రీంకోర్టులో విచార‌ణ‌లో ఉండ‌గా.. ఈడీ అధికారులు ఇలా అరెస్ట్ చేయ‌డం చ‌ట్ట వ్య‌తిరేకం అని పిటిష‌న్‌లో స్ప‌ష్టంగా పేర్కొన‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇది భార‌త రాష్ట్ర స‌మితికి ఊహించ‌ని ప‌రిణామం. రోజుకో ఎదురుదెబ్బ తింటున్న BRSకు ఈ అరెస్ట్ మ‌రో షాక్ అనే చెప్పాలి.

అత‌ను ఇచ్చిన స్టేట్మెంట్ వ‌ల్లే అరెస్ట్?

మాగుంట శ్రీనివాసుల రెడ్డి మాగుంట రాఘ‌వ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్స్ ద్వారా ఈ కేసు వేగంగా ముందుకెళ్లిన‌ట్లు తెలుస్తోంది. లిక్క‌ర్ స్కాంలో సౌత్ లాబీలో క‌విత‌ది కీల‌క పాత్ర అని రాఘ‌వ రెడ్డి ఈడీకి తెలిపారు. అందుకే ఈడీ త‌న పావుల‌ను వేగంగా క‌దిపిన‌ట్లు తెలుస్తోంది.

ట్రాన్సిట్ నోటీసులు లేకుండా అరెస్ట్?

సాధార‌ణంగా ఒక విచార‌ణ సంస్థ ఏదైనా కేసులో భాగంగా ఓ వ్య‌క్తిని విచార‌ణ చేయ‌డానికి వేరే రాష్ట్రానికి వెళ్లిన‌ప్పుడు ఆ వ్య‌క్తిని అక్క‌డి నుంచి అరెస్ట్ చేసి ఢిల్లీకి కానీ మ‌రో ప్ర‌దేశానికి కానీ త‌ర‌లించాలంటే ట్రాన్సిట్ నోటీసులు కావాలి. ఇందుకోసం ఈడీ అధికారులు లోక‌ల్ అధికారుల నుంచి అనుమ‌తి తీసుకోవాలి. ఆ అనుమ‌తి లేకుండానే ఈడీ అధికారులు క‌విత‌ను అరెస్ట్ చేసిన‌ట్లు KTR ఆరోపిస్తున్నారు.