Rythu Bandhu: సడెన్‌గా రైతు బంధు ఆపేయాలని ఎన్నికల సంఘం ఎందుకు ఆదేశించింది?
Rythu Bandhu: మంగళవారం నాటికి తెలంగాణలోని అందరు రైతుల ఖాతాల్లో రైతు బంధు వేస్తామని నిన్న BRS మంత్రి హరీష్ రావు (harish rao) ప్రకటించారు. ఈరోజు ఉన్నట్టుండి ఎన్నికల సంఘం రైతు బంధు లేదు ఏమీ లేదు వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
ఆపద్ధర్మ ప్రభుత్వాలు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఎలాంటి కొత్త పథకాలు ప్రకటించకూడదు. అదే విధంగా ఆల్రెడీ అమల్లో ఉన్న పథకానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోకూడదు. అంటే BRS ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు బంధు ఎప్పటినుంచో అమల్లో ఉంది. రైతులకు ఏటా డబ్బులు పడుతూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు తెలంగాణలో ఎన్నికలు (telangana elections) జరుగుతున్నాయి కాబట్టి వచ్చే ఏడాదికి వేయాల్సిన రైతు బంధు డబ్బులను ఇప్పుడే వేస్తామని BRS ప్రభుత్వం గతంలో ప్రకటించింది. ఇందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వాలని తెలిపింది. ఆ తర్వాత ఎన్నికల సంఘం కూడా డబ్బులు వేయొచ్చని అనుమతి ఇచ్చింది. కానీ ఈరోజు ఉన్నట్టుండి డబ్బులు వేయడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది. (rythu bandhu)
ఇందుకు కారణం ఏంటి?
ఎన్నికల కమిషన్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం నిన్న హరీష్ రావు చేసిన ప్రకటనే. మంగళవారానికి రైతుల ఖాతాల్లో రైతు బంధు నగదు పడుతుందని ప్రచార కార్యక్రమంలో ప్రకటించారు. దాంతో ప్రత్యర్ధి పార్టీ నేతలు హరీష్ రావుపై, BRS పార్టీపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసారు. హరీష్ రావు అలా ప్రకటన చేయడం పోల్ కోడ్‌ను ఉల్లంఘించడమేనని ఫిర్యాదులో పేర్కొన్నారు. గురువారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ రైతు బంధుని ప్రస్తుతానికి నిలిపివేయాలని ఆదేశించింది.
ఆల్రెడీ అమల్లో ఉన్న రైతు బంధు పథకాన్ని ఈ ఏడాది అక్టోబర్ నుంచి వచ్చే ఏడాది జనవరి వరకు ఎప్పుడైనా వాడుకోవచ్చని… రైతులకు డబ్బులు వేయొచ్చని ఎన్నికల కమిషన్ గతంలో ప్రకటించింది. అయితే ఇందుకు కొన్ని షరతులు కూడా విధించింది. ఎక్కడా కూడా రైతు బంధు డబ్బులు వేస్తాం అని ప్రకటనలు చేయకూడదని చెప్పినప్పటికీ హరీష్ రావు నోరు జారడంతో ఎన్నికల కమిషన్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. (rythu bandhu)