PV Narasimha Rao: ఆనాడు భౌతికకాయాన్ని కార్యాలయంలో పెట్టనివ్వని కాంగ్రెస్
PV Narasimha Rao: దివంగత ప్రధాని పీవీ నరసింహారావుకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న (Bharat Ratna) బిరుదు ప్రకటించడంపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి KCR హర్షం వ్యక్తం చేసారు. పీవీ నరసింహారావుకి భారతరత్న ఇవ్వాలని గతంలో BRS ప్రభుత్వం కేంద్రాన్ని పలుమార్లు కోరింది. తెలంగాణ బిడ్డ అయిన పీవీ నరసింహారావుకి ఇప్పుడు అసలైన గౌరవం దక్కిందని KCR అన్నారు. నెహ్రూ కుటుంబానికి చెందని తొలి కాంగ్రెస్ పార్టీ ప్రధాని అయిన పీవీ నరసింహారావు గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు తెలుసుకుందాం.
1991లో పీవీ నరసింహారావు తన ఆలోచనా విధానంతో ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టడం వల్ల దేశంలో లైసెన్స్ రాజ్ వ్యవస్థకి స్వస్థి పలికింది. భారతదేశం ఆర్ధికంగా ముందుకు వెళ్తోందంటే అందుకు పీవీ నరసింహారావు కూడా ఒక కారణం అని భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు.
“” మన మాజీ ప్రధాని శ్రీ పివి నరసింహారావు గారిని భారతరత్నతో సత్కరిస్తున్నందుకు సంతోషిస్తున్నాము. విశిష్ట పండితుడు, రాజనీతిజ్ఞుడిగా నరసింహారావు గారు భారతదేశానికి వివిధ హోదాలలో విస్తృతంగా సేవలందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, అనేక సంవత్సరాల పాటు పార్లమెంటు, శాసనసభ సభ్యునిగా ఆయన సమానంగా చేసిన కృషిని అందరూ గుర్తుంచుకుంటారు. భారతదేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయడంలో అతని దూరదృష్టి కలిగిన నాయకత్వం కీలకపాత్ర పోషించింది.
దేశ శ్రేయస్సు, అభివృద్ధికి బలమైన పునాది వేసింది. ప్రధానమంత్రిగా నరసింహారావు గారి పదవీకాలం భారతదేశాన్ని ప్రపంచ మార్కెట్లకు తెరిచి, ఆర్థికాభివృద్ధిలో కొత్త శకాన్ని ప్రోత్సహించే ముఖ్యమైన చర్యగా గుర్తించబడింది. భారతదేశ విదేశాంగ విధానం, భాష, విద్యా రంగాలకు ఆయన అందించిన సహకారం భారతదేశాన్ని క్లిష్టమైన పరివర్తనల ద్వారా నడిపించడమే కాకుండా దాని సాంస్కృతిక, మేధో వారసత్వాన్ని సుసంపన్నం చేసిన నాయకుడిగా నరసింహారావు బహుముఖ వారసత్వాన్ని నొక్కి చెబుతుంది. “” అని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.
2004లో ఢిల్లీలో పీవీ నరసింహారావు గుండెపోటుతో మరణించారు. ఆయన భౌతికకాయానికి హైదరాబాద్లో అంత్యక్రియలు జరిగాయి. అయితే పీవీ నరసింహారావు చనిపోయినప్పుడు ఆయన భౌతికకాయాన్ని AICC కార్యాలయంలో ఉంచడానికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ససేమిరా అంది. ఆయన మరణించిన తర్వాత దేశానికి ఎంత సేవ చేసారో కాంగ్రెస్ అస్సలు గుర్తించలేకపోయిందని ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ ఆరోపణలు చేస్తూనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వలేని గౌరవం తన నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినందుకు సంతోషంగా ఉందని నరేంద్ర మోదీ అన్నారు.
రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ పేరు మార్చాలి
మరోపక్క ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Rajiv Gandhi International Airport) రాజీవ్ గాంధీ పేరు తీసేసి పీవీ నరసింహారావు అంతర్జాతీయ విమానాశ్రయం అని పేరు పెట్టాలని BRS పార్టీ డిమాండ్ చేస్తోంది. దేశానికి రాజీవ్ గాంధీ కంటే పీవీ నరసింహారావే ఎక్కువ చేసారని గుర్తుచేసింది. తెలంగాణ గడ్డపై పుట్టిన వ్యక్తి పేరును తమ రాష్ట్రంలోని విమానాశ్రయానికి పెట్టకుండా రాజీవ్ గాంధీ పేరు అవసరమా అని నిలదీస్తున్నారు.