Purandeswari సమస్యేంటి? ఎందుకు భయపడుతున్నారు?
Purandeswari: అనపర్తి అసెంబ్లీ సీటు విషయంలో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ సీటును భారతీయ జనతా పార్టీ తీసుకుంది. ఇందుకు తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) కూడా ఏమాత్రం అభ్యంతరం తెలపలేదు. కానీ పురంధేశ్వరి మాత్రం ఈ సీటును వెనక్కి తీసుకోవాలని అంతర్గతంగా చర్చలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. రాజమండ్రి పార్లమెంట్, అనపర్తి అసెంబ్లీ సీట్లు భారతీయ జనతా పార్టీకి వెళ్లాయి.
పురంధేశ్వరి రాజమండ్రి సీటు నుంచి పోటీ చేస్తారు. అనపర్తి సీటుపై సస్పెన్స్ పెరుగుతోంది. అనపర్తి అసెంబ్లీ స్థానం కోసం అభ్యర్ధులను వెతుకుతుంటే పురంధేశ్వరి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సీటును ఇవ్వద్దు అంటూ తెలుగు దేశం కేడర్‌కు రాయబారం పంపుతున్నారట. అదేంటి అని అడిగితే.. ఎక్కడి లెక్కలు అక్కడ ఉంటాయి అని చెప్తున్నారట. అనపర్తి రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో ఉంది. 2009లో ఇక్కడి నుంచి తెలుగు దేశం అభ్యర్ధి మురళీ మోహన్ పోటీ చేసారు.
పార్లమెంట్ పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగు దేశంకు ఆధిక్యం వచ్చింది. కానీ అనపర్తిలోనే కాంగ్రెస్‌కు 60 వేల ఆధిక్యత లభించింది. అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్ధిగా ఉండవల్లి అరుణ్ కుమార్ అనపర్తి నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పటివరకు 50 వేల మెజారిటీతో ఉన్న మురళీ మోహన్… అనపర్తి అసెంబ్లీ దెబ్బకి 10 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అనపర్తి ఓటర్లు ఏ పార్టీకి ఓటేసినా ఏక పక్షంగా నిలబడతారు. ఎవరి వైపు మొగ్గు చూపినా కనీసం 40 నుంచి 50 వేల మెజారిటీ ఇచ్చేస్తారు. అదే ఇప్పుడు పురంధేశ్వరిని భయపెడుతోందని టాక్. వాస్తవానికి అనపర్తిలో భారతీయ జనతా పార్టీకి తగిన అభ్యర్ధి లేరు. దాంతో భారతీయ జనతా పార్టీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు అనపర్తి టికెట్ ఇవ్వాలని హై కమాండ్ భావిస్తోంది.
ఒకవేళ సోము వీర్రాజు సరిపోరు అన్న అభిప్రాయం వ్యక్తం అయితే పార్టీకి చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడ్ని బరిలోకి దింపాలని సీనియర్స్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే భారీ తేడాతో అనపర్తి కోల్పోవలసి వస్తుందని ఆ ప్రభావం తనపై కూడా పడుతుందన్న భయంతోనే పురంధేశ్వరి వనపర్తి వద్దు అని చెప్తున్నట్లు సమాచారం.