ప్రమాణ స్వీకారం.. శిష్యుడికి అందని ఆహ్వానం.. కారణం అదేనా?
Revanth Reddy: తెలుగు దేశం పార్టీ అధినేత.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎందరో అతిరథ మహారథులను ఆహ్వానించారు. వారిలో తన శిష్యుడు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఉంటారని అంతా అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు రేవంత్‌ను పిలవలేదు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు కూటమి గెలవడంతో రేవంత్ ఆయనకు ఫోన్ చేసి మరీ అభినందనలు తెలిపారు. త్వరలో కలుద్దాం అని కూడా అనుకున్నారు. కానీ ప్రమాణ స్వీకారానికి రేవంత్ రాకపోవడంపై ఎన్నో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
NDA కూటమి వల్లే..
ఒకవేళ చంద్రబాబు నాయుడు ఒంటరిగా పోటీ చేసో లేక కేవలం జనసేనతో పొత్తు పెట్టుకుని పోటీ చేసో గెలిచి ఉంటే అప్పుడు తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి వెళ్లేవారు. కానీ పొత్తులో కాంగ్రెస్‌కు బద్ధ శత్రువైన భారతీయ జనతా పార్టీ ఉండటంతో ఆయనకు ఆహ్వానం అందలేదనే టాక్ వినిపిస్తోంది.
శిష్యుడా తొక్కా..
ఇక్కడ మరో అంశం కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంది.ఓ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు గురించి ప్రస్తావించారు. మిమ్మల్ని అంతా చంద్రబాబుకు శిష్యుడు అంటుంటారు కదా అని యాంకర్ అడగ్గా.. శిష్యుడా తొక్కా అదేమీ లేదు. ఆయనతో కలిసి పనిచేసాను. అంతవరకే ఏదైనా అని వ్యాఖ్యానించారు. బహుశా ఈ కారణం వల్ల కూడా రేవంత్‌ను పిలవకపోయి ఉండొచ్చు.