Jagan: ఒంటరిగా పోటీ చేసే ధైర్యం చంద్రబాబు, పవన్‌కు లేదా?

AP: 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు, దత్తపుత్రుడికి ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదని సీఎం జగన్‌(jagan) ఫైర్‌ అయ్యారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌(jagan) ఇవాళ బాపట్ల జిల్లా నిజాంపట్నంలో ఫిషింగ్‌ హార్బర్‌ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా నిర్వహించిన బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు. తొలుత మత్స్యకార భరోసా నిధులను డీబీటీ ద్వారా జమ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతు.. ప్రధానుల్ని రాష్ట్రపతుల్ని తానే చేశానని చెప్పుకునే చంద్రబాబు, కోతలు కోసే బాబుకు 175 నియోజక వర్గాల్లో ఒంటరిగా బరిలోకి దిగే సత్తా లేదని ఎద్దేవా చేశారు. కనీసం 175 స్థానాల్లో పోటీ చేస్తే తన పార్టీకి రెండో స్థానం వస్తుందనే నమ్మకం కూడా బాబుకు లేదన్నారు. బహిరంగ సమావేశాలు పెట్టే దమ్ము చంద్రబాబుకు లేక చిన్నచిన్న సందుల్లో సమావేశాలు పెట్టుకుంటున్నారని, ఇరుకు సందుల్లో జనం చనిపోతుంటే వారి మీద సానుభూతి కూడా చూపట్లేదని జగన్‌ మండిపడ్డారు.

చంద్రబాబు, ఆయన పార్టీ వెంటిలేటర్‌పై ఉన్నాయని.. నలుగురు కలిసి లేపితే తప్ప లేవని స్థితిలో ఆ పార్టీ, బాబు ఉన్నారని తీవ్రంగా విమర్శించారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ పై ఆరోపణలు చేశారు. రెండు చోట్ల పోటీ చేస్తే, ఎమ్మెల్యేగా కూడా వద్దు అని ఆయనకు జనం నమస్కారం పెట్టారని, పదేళ్ల క్రితం పార్టీ పెట్టిన దత్తపుత్రుడు 175 నియోజకవర్గాల్లో కనీసం అభ్యర్థుల్ని కూడా పెట్టలేని స్థితిలో ఉన్నాడని, ఒక్కో ఎన్నికకు ఒక్కో రేటుకు, పార్టీని హోల్‌సేల్‌గా అమ్ముకునే స్థితిలో ఉన్నాడని జగన్‌ ఆరోపించారు. ముఖ్యమంత్రిని కాకపోయినా, దోపిడిలో తనకు కావాల్సిన వాటా వస్తే చాలంటున్నాడని, వీళ్లంతా ఎందుకు కలుస్తున్నారో ప్రజలు ఆలోచించాలని కోరారు. రాష్ట్రాన్ని దోచుకోవడం కోసం, దోచుకున్న దానిని పంచుకోవడానికి ప్రతిపక్షాలు అన్ని కలుస్తున్నాయని అన్నారు.