Telangana Elections: గ‌జ్వేల్ గ‌ద్దె ఎవ‌రిది?

Telangana Elections: తెలంగాణ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో క‌ళ్ల‌న్నీ గ‌జ్వేల్ (gajwel) నియోజ‌క‌వ‌ర్గంపైనే ఉన్నాయి. ఎందుకంటే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో తెలంగాణ సీఎం KCRతో పాటు.. BJP నుంచి ఈటెల రాజేంద‌ర్ (etela rajender) కూడా పోటీ చేయ‌బోతున్నారు.

ఈటెల ఎందుకు పోటీ చేయాల‌నుకుంటున్నారు?

BRS పార్టీలో ఎంతో కాలం ప‌నిచేసిన ఈటెల 2021లో అధిష్ఠానంతో స‌మ‌స్య‌లు రావ‌డంతో పార్టీకి రాజీనామా చేసి BJPలో చేరిన సంగ‌తి విదిత‌మే. అయితే KCR ఎస్సీ, ఎస్టీ, బీసీల‌కు డ‌బ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నార‌ని bjp కేడ‌ర్‌ను ప్ర‌భావితం చేయాల‌ని చూస్తున్నార‌ని ఈటెల ఆరోపిస్తున్నారు. ఏ పార్టీ కోస‌మైతే క‌ష్ట‌ప‌డి ప‌నిచేసానో అదే పార్టీ అధినేతపై పోటీ చేసి గెలిచి చూపిస్తాన‌ని శ‌ప‌థం చేసారు. 2021లో హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో ఎలాగైతే BRSపై గెలిచానో ఇప్పుడు కూడా గ‌జ్వేల్‌లో అదే విధంగా గెలుస్తాన‌ని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. (telangana elections)

ఇద్ద‌రూ రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి పోటీ

KCR, ఈటెల రాజేంద‌ర్‌లు రెండు నియోజ‌క‌వ‌ర్గాల నుంచి తెలంగాణ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్నారు. KCR త‌న నియోజ‌క‌వ‌ర్గం అయిన గ‌జ్వేల్‌తో పాటు కామారెడ్డిలో పోటీ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించ‌గా.. ఈటెల త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం అయిన హుజూరాబాద్‌తో పాటు గ‌జ్వేల్‌లో పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. సో ఇప్పుడు గ‌జ్వేల్ ఒక్క‌టే చ‌ర్చ‌నీయాంశంగా మారింది. గ‌జ్వేల్ గద్దె ఎవ‌రిదో అని ప్ర‌జ‌ల్లో పెద్ద స్థాయిలో చ‌ర్చ మొద‌లైంది.

ఈటెల గెలుపు మంత్రాలు

ఈటెల రాజేంద‌ర్ బీసీ వ‌ర్గానికి చెందిన నేత‌. ఏదో పార్టీలో అంత‌ర్గ‌త స‌మ‌స్య‌లు రావ‌డం వ‌ల్ల ఆయ‌న కేవ‌లం పార్టీకి మాత్ర‌మే దూర‌మ‌య్యారు కానీ ఇప్ప‌టికీ BRS కార్య‌క‌ర్త‌ల నుంచి స‌పోర్ట్ మెండుగా ఉంద‌నే చెప్పుకోవాలి. ముఖ్యంగా యాద‌వులు, గౌడ్స్, ముదిరాజ్ వ‌ర్గాల‌కు చెందిన‌వారి స‌పోర్ట్ ఈటెల‌కే ఉందని క‌నిపిస్తోంది.

KCR గెలుపు మంత్రాలు

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అయిన‌ప్ప‌టి నుంచి గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గానికి ఎంతో చేసారు KCR. ఇప్పుడు తాను గ‌జ్వేల్ ప్ర‌జ‌ల కోసం చేసిన‌వి మ‌రిన్ని చేయాల్సిన‌వి చెప్పుకుంటూ ప్ర‌జ‌ల న‌మ్మ‌కాన్ని పెంచుకోవాల‌ని చూస్తున్నారు. రైతు బంధు, షాదీ ముబార‌క్, క‌ళ్యాణ ల‌క్ష్మి ప‌థ‌కాలు KCRను గ‌జ్వేల్‌లో గెలిపించే అవ‌కాశం ఉంది.

కాంగ్రెస్ ఊసే లేదు

BRS నుంచి KCR , BJP నుంచి ఈటెల రాజేంద‌ర్ గ‌జ్వేల్‌లో పోటీ చేస్తారు. ఇక కాంగ్రెస్ త‌ర‌ఫు నుంచి న‌ర్సారెడ్డి పోటీ చేయ‌నున్నారు. కానీ ఇప్పుడు చ‌ర్చ‌, ఫోక‌స్ ఈటెల‌, KCRల‌పైనే ఉంది. కాబ‌ట్టి ఇక్క‌డ న‌ర్సారెడ్డి గెలిచే ఛాన్సులు అంత‌గా క‌నిపించ‌డంలేద‌ని రాజ‌కీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

గ‌త ఎన్నిక‌ల ఫ‌లితం

2018 ఎన్నిక‌ల్లో గ‌జ్వేల్‌లో పోటీ చేసిన కాంగ్రెస్ నేత ప్ర‌తాప్ రెడ్డిని KCR 50,000 ఓట్ల తేడాతో ఓడించారు. ఆ త‌ర్వాత ఎవ్వ‌రూ ఊహించ‌ని ప‌రిణామం చోటుచేసుకుంది. ఏ పార్టీ నేత అయితే త‌న‌ను గ‌జ్వేల్‌లో ఓడించారో అదే పార్టీలో (BRS) చేరిపోయారు ప్ర‌తాప్ రెడ్డి.