Israel: యుద్ధం ఆగిపోయాక గాజాను ఎవరు పాలిస్తారు? హమాస్ ఏమంటోంది?
Israel: ప్రస్తుతం ఇజ్రాయెల్ గాజాపై భీకర దాడులకు పాల్పడుతూనే ఉంది. సాధారణ ప్రజలు చనిపోతున్నారు ఇక ఆపండి అని ఇతర దేశాలు నచ్చజెప్తున్నా కూడా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు (benjamin netanyahu) అస్సలు తగ్గడంలేదు. కావాలంటే రోజులో నాలుగు గంటలు బ్రేక్ ఇచ్చి మళ్లీ దాడుల చేయిస్తానని అన్నారు. ఇప్పటికి ఈ యుద్ధం మొదలై ఐదు వారాలు అవుతోంది. అయితే ఎప్పుడైతే ఈ యుద్ధం ఆగిపోతుందో ఆ తర్వాత గాజా ఎవరి ఆధీనంలో ఉంటుంది అనేది పెద్ద ప్రశ్నగా మారింది. గాజా పాలనను ఇజ్రాయెల్ చూసుకుంటుందా? లేక పాలెస్తీనానా?
అమెరికా స్టేట్ సెక్రటరీ బ్లింకెన్ (blinken) గాజాను పాలెస్తీనా అథారిటీ పాలిస్తే బాగుంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు. దీని కోసం అంతర్జాతీయ మధ్యంతర మద్దతు అవసరం ఉంటుందని అన్నారు. ప్రస్తుతానికి పాలెస్తీనా పాలనలో వెస్ట్ బ్యాంక్ ఉంది. గాజాను తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలంటే మున్ముందు రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో సమగ్ర రిపోర్ట్ తమకు కావాలని దానిని బట్టి నిర్ణయం తీసుకుంటామని అంటోంది.
ఇక బెంజమిన్ నేతన్యాహు తనకు అసలు గాజాను స్వాధీనం చేసుకోవాలన్న ఆలోచనే లేదని కానీ గాజాను అడ్డుపెట్టుకుని తమపై దాడి చేస్తున్న హమాస్ పైనే తమ గురి ఉందని అంటున్నారు. ప్రస్తుతం గాజాను హమాస్ పాలిస్తోంది. తమకు ఎలాంటి తోలుబొమ్మలాటలు ఆడించే ప్రభుత్వ పాలన వద్దని గాజా తమ చేతిలోనే ఉంటుందని హమాస్ అంటోంది. అమెరికా, బ్రెజిల్, బ్రిటన్‌లు హమాస్‌ను ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తున్నాయి. హమాస్‌ను ఎదుర్కోకుండా పాలెస్తీనా గాజాను తమ ఆధీనంలోకి తెచ్చుకోలేదని ఆ దేశాలు అభిప్రాయపడుతున్నాయి.
అటు పాలెస్తీనా కానీ ఇటు ఇజ్రాయెల్ కానీ గాజాపై చెయ్యి వేస్తే హమాస్ నరికేసేలా ఉంది. కాబట్టి గాజాను ఎవరు పాలించాలన్నా ముందు హమాస్‌ను పూర్తిగా నిర్మూలించాకే సాధ్యమవుతుంది. ఈ యుద్ధాల్లో సాధారణ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటివరకు ఇజ్రాయెల్ గాజా హమాస్‌కు మధ్య జరిగిన యుద్ధంలో దాదాపు 11000 మంది ప్రాణాలు కోల్పోయారు.