Caste Census: కుల గణన చేస్తే నష్టం మనకేనా?
Caste Census: ఎన్నికల హడావిడి మొదలవగానే కుల గణన అనే అంశంపై చర్చ మొదలైంది. ముందు ఈ కుల గణనను చేపట్టాలన్న ఆలోచన కాంగ్రెస్‌కే వచ్చింది. ఇందుకు BJP ముందు ఒప్పుకోలేదు. ఆ తర్వాత బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (nitish kumar) తన రాష్ట్రంలో కుల గణన చేపట్టారు. కులాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలకు పాల్పడకూడదు అంటూ కేంద్రం సుప్రీంకోర్టులో నితీష్ కుమార్‌పై కేసు వేసింది. కానీ ఈ పిటిషన్ చెల్లలేదు. ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ కుల గణన వంటి అంశాలపై నిర్ణయం తీసుకునే హక్కు ఉంటుందని తెలిపింది.
కుల గణన అంటే ఏంటి?
ఫలానా రాష్ట్రంలో వివిధ కులాలకు చెందినవారు ఎంత మంది ఉన్నారు అన్న వివరాలు బయటికి తీయడాన్నే కుల గణన అంటారు. సాధారణంగా భారతదేశంలో కులాలకు సంబంధించిన అంశాలను బయటికి చెప్పరు. కానీ కాంగ్రెస్ మాత్రం ఈ విధానాన్ని మార్చాలని చూస్తోంది. ఇందుకు ముందు BJP వ్యతిరేకించినప్పటికీ 2024లో లోక్ సభ ఎన్నికలు (lok sabha elections) ఉండటంతో వారికి కూడా కుల గణన కలిసొస్తుందేమో అని మద్దతు ఇస్తోంది. (caste census)
కాంగ్రెస్‌కి కుల గణనపై అంత ఆసక్తి ఎందుకు?
మొన్నటి వరకు కాంగ్రెస్ కుల, మతాలకు అతీతంగా ప్రభుత్వ పాలన ఉండాలన్న నియమాన్నే పాటించింది. ఉన్నట్టుండి కుల గణన చేస్తేనే ఎవరు వెనుకబడి ఉన్నారో ఎవరు అందాల్సిన దాని కంటే ఎక్కువ లాభాలు పొందుతున్నారో తెలుస్తుందని కాంగ్రెస్ అంటోంది.
ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుంది?
కుల గణన చేపడితే OBCలలోనే అంతర్గత సమస్యలు వచ్చే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు చెప్తున్నారు. ఇటీవల బయటపడ్డ నివేదికలో BJPకి సపోర్ట్‌గా నిలుస్తోంది దళితులు, OBCలే అని తేలింది. కుల గణన వల్ల వెనుకబడ్డ కులాల వారికి సరైన పథకాలు తీసుకొచ్చి వారికి మేలైన భవిష్యత్తు అందించవచ్చు అని మాత్రమే కాంగ్రెస్ అంటోంది కానీ అది ఎలా జరుగుతుంది అనే ప్రణాళికను మాత్రం చెప్పడంలేదు.
లాభం ఎవరికి నష్టం ఎవరికి?
కుల గణన చేపడితే కచ్చితంగా ముందు లాభపడేది రాజకీయ పార్టీలే. అందుకే రాహుల్ గాంధీ అధికారంలోకి వస్తే తెలంగాణలో కుల గణన చేపడతానని చెప్పి ఓట్లు కోరుతున్నారు. కొంత మేరకు కొన్ని కులాల వారికి నష్టం కూడా వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. ఆ కులం వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ కులం వారికి తక్కువగా ఉన్నాయి అనే అంతర్గత సమస్యలకు దారి తీసే ప్రమాదం లేకపోలేదు.