Women’s Reservation Bill: ఎవరెవరు ఏమన్నారు..?
మహిళా రిజర్వేషన్ బిల్లుకు (women’s reservation bill) నిన్న ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) ఆమోదం తెలిపాక ఈరోజు పార్లమెంట్‌లో ప్రత్యేకంగా 7 గంటల పాటు ఈ బిల్లుపై సమావేశం జరిగింది. మహిళలకు సంబంధించిన బిల్లు కాబట్టి మహిళా ఎంపీలే మాట్లాడతారేమో అనుకున్నారు కానీ ఇద్దరు మగ ఎంపీలు కూడా మాట్లాడటం చర్చనీయాంశంగా మారింది. ఈ బిల్లు గురించి ఎవరెవరు ఏమన్నారో చూద్దాం.
సోనియా గాంధీ (sonia gandhi)
“” ఈరోజు నేను నారీ శక్తి వందన్ అధినియం (రిజర్వేషన్ బిల్లుకు పెట్టిన పేరు)కు పూర్తిగా నా సహకారం తెలియజేస్తున్నాను. మహిళల ప్రయాణం పొగతో నిండిన వంట గది నుంచి స్టేడియం లైట్ల వరకు వెళ్లింది “” అంటూ సోనియా తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. సోనియాతో పాటు ఇతర పార్టీ నేతలు.. ఎన్నికలకు కొన్ని నెలలు ఉండగానే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడంపై మండిపడ్డారు. ఇది ముందే ఎందుకు చేయలేదు అని ప్రశ్నించారు. 2010లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు రాజ్యసభలో ఆమోదం పొందింది కానీ లోక్‌సభలో మాత్రం రాష్ట్రీయ జనతా దళ్, సమాజ్‌వాది పార్టీ ఆమోదానికి ఒప్పుకోలేదని గుర్తుచేసారు. 2029 ముందు ఈ బిల్లును ప్రవేశపెడితే ఎలాంటి ప్రభావం చూపదని కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా దీనిని వెంటనే ప్రవేశపెట్టాలని కోరారు. (women’s reservation bill)
కనిమొళి (kanimozhi)
DMK ఎంపీ కణిమొళి ఈ బిల్లు గురించి మాట్లాడటానికి సీటు నుంచి లేవగానే BJP నేతలు ఆమెను వెక్కిరించారు. ఇక నుంచి ప్రభుత్వాలు మహిళలు కనిపిస్తే నిలబడటం సెల్యూట్ చేయడం మాని వారికి అన్ని రంగాల్లో సమాన హక్కులు కల్పించాలని కోరారు. “” మమ్మల్ని అమ్మ, అక్క, భార్య అని పిలవడం మానేసి సమానంగా చూస్తే బాగుంటుంది. అసలు ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ముందు అవసరమైనవారితో చర్చలు జరిపారా? ఎందుకంటే చర్చలు జరిపాకే ఈ బిల్లును ఆమోదిస్తామని మాకు చెప్పారు. ఏదో రహస్యంగా తొందర్లో ఈ బిల్లును ఆమోదించేసారు. అసలు ఏం చర్చలు జరిపారు.. ఎలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకున్నారో మాకూ తెలియాలి “” అని తెలిపారు.
సుప్రియా సూలే (supriya sule)
NCP ఎంపీ సుప్రియా సులే కూడా ఈ బిల్లు గురించి మాట్లాడారు. గతంలో సీనియర్ BJP నేత తనను ఇంటి పనులు చూసుకోవాలని దేశం అభివృద్ధి గురించి మగవారు చూసుకుంటారు అని ఎగతాళి చేసిన అంశాన్ని లేవనెత్తారు. BJP నేతల మైండ్‌సెట్ ఇలాగే ఉంటుందని మండిపడ్డారు. అంతేకాదు.. కనిమొళి ప్రసంగాన్ని మెచ్చుకున్నారు కూడా. (women’s reservation bill)
స్మృతి ఇరానీ (smriti irani)
BJP ఎంపీ స్మృతి ఇరానీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేరు తీయకుండా ఆమెపై పరోక్షంగా పంచ్ వేసారు. “” విజయానికి తండ్రులు ఉంటారు కానీ అపజయానికి ఎవ్వరూ ఉండరు. కొందరు బిల్లును ప్రవేశపెట్టగానే మా బిల్లు అని ఎగిరిపడుతున్నారు “” అంటూ సెటైర్ వేసారు. 2024 ముందే ఈ బిల్లుకు ఆమోదం తెలపాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని..కాంగ్రెస్ రాజ్యాంగ నిబంధనలు అతిక్రమించాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు.
ఇతరులు ఏమన్నారు?
TMC నేత కకోలీ ఘోష్ మాట్లాడుతూ.. మహిళా రెజ్లర్లు.. WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై BJP ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదు అని ప్రశ్నించారు. ఇంత ఆలస్యంగా మహిళా రిజర్వేషన్ బిల్లును పాస్ చేయాలని అనుకుంటున్నారంటే ఇది ఎన్నికల జిమ్మక్కే అని ఆరోపించారు. (women’s reservation bill)