Telangana Elections: ఏ పార్టీ ఎన్ని డిపాజిట్లు కోల్పోయింది?
Telangana Elections: తెలంగాణ ఎన్నికల్లో మొత్తానికి కాంగ్రెస్ (congress) అధికారంలోకి వచ్చేసింది. ఇక సీఎం ఎవరు అనేదానిపై సస్పెన్స్ వీడాల్సి ఉంది. అయితే.. మొన్న జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని డిపాజిట్లు కోల్పోయింది అనే వివరాలను తెలుసుకుందాం.
119 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ 64 సీట్లలో గెలవగా BJP 8 సీట్లతో సరిపెట్టుకుంది. ఇక మిగిలిన సీట్లు BRS పార్టీ కైవసం చేసుకుని ప్రతిపక్ష హోదాలో ఉండిపోయింది. BJP పోటీ చేసిన చోట కాంగ్రెస్ గెలవడంతో.. BJP అభ్యర్ధులు డిపాజిట్లు కోల్పోయారు. మరోపక్క కాంగ్రెస్ 13 సీట్లలో, BRS 7 సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది. అత్యధిక డిపాజిట్లు కోల్పోయిన పార్టీ మాత్రం బహుజన్ సమాజ్ పార్టీ. దాదాపు 106 సీట్ల నుంచి పోటీ చేసిన BSP 105 సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది. ఆ ఒక్క సీటు BSP అధినేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేసిన సిర్పూర్‌లో మాత్రం ఆయన మూడో స్థానం దక్కించుకున్నారు.
డిపాజిట్ అంటే ఏంటి?
ఎన్నికల సమయంలో పోటీ చేయాలనుకున్న అభ్యర్ధులు ఎన్నికల సంఘానికి 34 (1)(a) కింద కొంత డబ్బు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. పోలింగ్ అయ్యాక పోటీ చేసిన అభ్యర్ధికి 16.67% కంటే తక్కువ ఓట్లు వస్తే వారు డిపాజిట్ చేసిన నగదు రీఫండ్ చేసుకోవడానికి కుదరదు. మెజారిటీ ఓట్లు వచ్చినవారు కానీ ఓడిపోయినా రెండో స్థానాన్ని దక్కించుకున్న అభ్యర్ధి కానీ డిపాజిట్ చేసిన డబ్బును రీఫండ్ ద్వారా రాబట్టుకోవచ్చు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రూ.10,000 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. లోక్ సభ ఎన్నికల్లో మాత్రం రూ.25,000 డిపాజిట్ చేయాలి. SC, ST నేతలు మాత్రం డిపాజిట్ చేయాల్సిన మొత్తంలో సగం చెల్లిస్తే కాదు.
డిపాజిట్ ఎందుకు చెల్లించాలి?
డిపాజిట్ అనే అంశం లేకపోతే ఎవరు పడితే వారు వచ్చి నామమాత్రంగా నామినేషన్లు వేసి వెళ్లిపోతారు. ఇలాంటి వారి ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల సంఘం ఈ డిపాజిట్ అనే కాన్సెప్ట్‌ను తీసుకొచ్చింది.
BJP లాంటి జాతీయ గుర్తింపు ఉన్న పార్టీ 64 సీట్లలో డిపాజిట్ కోల్పోవడం ఇప్పుడు పెద్ద మ్యాటర్ కాదు. ఎందుకంటే 2018 ఎన్నికల్లో 115 సీట్ల నుంచి పోటీ చేస్తే 105 సీట్లలో డిపాజిట్లు కోల్పోయింది. అలా చూసుకుంటే ఇప్పుడు కాస్త నిలదొక్కుకుంది. ఉత్తర తెలంగాణలో బాగానే పెర్ఫామ్ చేసింది. కనీసం అక్కడ డిపాజిట్లు అయితే కోల్పోలేదు. అయితే ప్రముఖ నటుడు బాబు మోహన్ (babu mohan) మాత్రం డిపాజిట్ కోల్పోయారు. ఆయన BJP నుంచి ఆంధోల్‌లో పోటీ చేయగా కేవలం 2.6% ఓట్లు మాత్రమే గెలుచుకున్నారు.