ఇండిపెండెంట్ అభ్యర్ధికి హక్కులుండవా.. వీరికి పార్టీ అభ్యర్ధులకేంటి తేడా?
Telangana Elections: ఎన్నికలు వచ్చాయంటే ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు అన్న అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంటుంది. ఎన్నికలంటే ఫలానా పార్టీ నుంచి మాత్రమే పోటీ చేయాలన్న నియమం ఏమీ లేదు. పార్టీలకు అతీతంగా ప్రజలకు మంచి చేయాలనుకుంటే ఇండిపెండెంట్‌గానూ (independent) నామినేషన్ వేయచ్చు. ఇంకో వారంలో జరగబోయే తెలంగాణ ఎన్నికల్లోనూ స్వతంత్ర అభ్యర్ధులుగా బరిలోకి దిగినవారు ఉన్నారు. అయితే.. స్వతంత్ర అభ్యర్ధికి.. పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్ధికి తేడా ఏంటి? వారికి ఉండే హక్కలేంటి?
ఇండిపెండెంట్‌గా ఎవరు పోటీ చేయొచ్చు?
ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలనుకుంటే కచ్చితంగా అభ్యర్ధి వయసు 25 ఏళ్లు పైబడే ఉండాలి.
ఆ అభ్యర్ధికి మద్దతుగా అదే నియోజకవర్గానికి చెందిన కనీసం పది మంది మద్దతు ఉండాలి. వారి సంతకాలు నామినేషన్ పత్రాలపై ఉండాలి.
ఆ అభ్యర్ధి ఏ రాజకీయ పార్టీకి కూడా చెంది ఉండకూడదు.
తేడా ఏంటి?
ఇండిపెండెంట్ అభ్యర్ధికి, పార్టీ నుంచి పోటీ చేసే వ్యక్తికి మధ్య తేడా పెద్దగా ఏమీ ఉండదు కానీ.. నామినేషన్ సమయంలో పార్టీ తరఫున పోటీ చేసే వ్యక్తి అదే పార్టీకి చెందిన మరో వ్యక్తితో కలిసి నామినేషన్ వేస్తే సరిపోతుంది. కానీ ఇండిపెండెంట్ అభ్యర్ధి మాత్రం పైన చెప్పినట్లు కనీసం 10 మంది మద్దతుదారులతో కలిసి వెళ్లాలి.
అయితే ఈ మధ్యకాలంలో ఇండిపెండెంట్ అభ్యర్ధుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. వారు గెలుపు శాతం మాత్రం దారుణంగా పడిపోతోంది. ఇందుకు పలు కారణాలు ఉన్నాయి. ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలనుకునే ప్రతీ వ్యక్తి తన నియోజకవర్గ ప్రజల కోసం నిలబడతాడన్న గ్యారెంటీ లేకపోవడం.. ఏదో పాపులారిటీ వస్తుంది కదా అని నామినేషన్ వేయడమే ఇందుకు కారణం.
మరో అంశం ఏంటంటే.. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తున్న వ్యక్తికి అదే నియోజకవర్గంలో కాస్త సపోర్ట్ ఉన్నా కూడా బరిలోకి దిగే పార్టీలు వారిని ఏదో ఒకటి చెప్పి తమ పార్టీలోకి లాక్కోవాలని చూస్తుంటాయి. ఒకవేళ ప్రజలకు మంచి చేయాలనుకుని ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచినా అధికార పార్టీ నిధులు ఇస్తుందన్న గ్యారెంటీ లేదు.
ఇండిపెండెంట్ అభ్యర్ధికి అధికార పార్టీ కేబినెట్‌లో స్థానం ఉందా?
తప్పకుండా ఉంటుంది. కాకపోతే ఇండిపెండెంట్‌గానే కేబినెట్‌లో ఉంటానంటే అవ్వదు. ఆ అధికార పార్టీతో కలవాల్సిందే.
ఎన్నికల గుర్తు
సాధారణంగా అధికార పార్టీలకు ఎన్నికల కమిషన్ ఎన్నికల గుర్తును కేటాయిస్తుంది. ఆ గుర్తుతోనే ప్రచారం చేసుకోవాలి. కానీ ఇండిపెండెంట్ అభ్యర్ధులకు మాత్రం మూడు గుర్తులు ఇచ్చి వారినే ఎంచుకోమనే స్వేచ్ఛను ఇస్తుంది.