Sheikh Hasina: నాడు తండ్రి హత్యకు గురై.. నేడు కూతురు పరారై..
Sheikh Hasina: షేక్ హసీనా.. స్వాతంత్ర సమరయోధుడు షేక్ ముజీబుర్ రెహ్మాన్ కూతురు. తండ్రి చనిపోయినప్పుడు హసీనా వయసు 28. ఆ తర్వాత ఆవామీ లీగ్ పేరిట ఉద్యమాన్ని మొదలుపెట్టి బంగ్లాదేశ్‌లో అడుగుపెట్టి రాజకీయంగా ఎదిగారు. 1996లో తొలిసారి బంగ్లాదేశ్ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆమె తొలి గెలుపు బంగ్లాదేశ్‌కు ఆర్థిక వనరులు తెచ్చిపెట్టాయి. అయితే వరుసగా మూడోసారి హసీనా ఎన్నికల్లో గెలవడంపై ఆమె రిగ్గింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆమె తండ్రి బంగ్లాదేశ్ ప్రజలకు హీరోతో సమానం. అలాంటిది కూతురు ప్రజల పాలిట విలన్‌గా ఎలా మారింది? ఎందుకు మారాల్సి వచ్చింది?
77 ఏళ్ల హసీనా.. అవామీ లీగ్ తరఫున బంగ్లాదేశ్‌కు ముచ్చటగా మూడుసార్లు ప్రధాని అయ్యారు. ప్రజలు ఆరాధ్య దేవతగా భావించే హసీనా ఆర్మీ ఆగ్రహానికి గురై ఈరోజు బంగ్లాదేశ్ నుంచి పారిపోయి ఢిల్లీలో హెలికాప్టర్లో ల్యాండ్ అవ్వాల్సి వచ్చింది. ఇక ఢిల్లీ నుంచి ఆమె యూకే వెళ్లిపోయేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. హసీనా తండ్రి బంగ్లాదేశ్ ఆర్మీ అధికారుల చేతిలోనే అత్యంత దారుణంగా హత్యకు గురయ్యారు. తూర్పు పాకిస్థాన్‌కు స్వాతంత్ర్యం రావడంతో అది కాస్తా బంగ్లాదేశ్ దేశంగా ఏర్పడింది. ఈరోజు బంగ్లాదేశ్‌లో జరుగుతున్న అల్లర్లలో హసీనా తండ్రి విగ్రహాలు కూల్చివేతకు గురయ్యాయి.
ఇప్పుడు బంగ్లాదేశ్‌లో ఆందోళనలు ఎందుకు జరుగుతున్నాయి?
ఇక ఇప్పుడు బంగ్లాదేశ్ అల్లర్లలో అట్టుడికిపోతోంది. ఈ ఘటనలో 300 మంది మృత్యువాతపడ్డారు. దాంతో దేశాన్ని ఆర్మీ స్వాధీనంలోకి తెచ్చుకుంది. హసీనా 48 గంటల్లో రాజీనామా చేసి వెళ్లిపోవాలని ఆర్మీ డెడ్‌లైన్ విధించడంతో వెంటనే రాజీనామా చేసి ఢిల్లీ మీదుగా యూకే వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు.
ఇప్పుడు బంగ్లాదేశ్‌లో జరుగుతున్న అల్లర్లకు కారణం హసీనా తీసుకున్న నిర్ణయం. అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా కల్పించినందుకు స్థానిక విద్యార్ధులు ఆందోళనకు దిగారు. వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆదేశించారు. హసీనా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోవడంతో ఈ మారణకాండకు దారి తీసింది. ఇక హసీనాపై గతంలో పలు గ్రెనేడ్ ఎటాక్స్, హత్యాయత్నాలు జరిగాయి. మూడుసార్లు ఆమె హౌజ్ అరెస్ట్‌కు గురయ్యారు. అయితే ఈరోజుతో హసీనా రాజకీయ జీవితం ముగిసిందా లేదా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది.