AIADMK vs BJP: నాడు స్నేహం.. నేడు వైరం.. ఏం జరిగింది?
తమిళనాడుకి చెందిన అన్నాడీఎంకే (AIADMK).. NDA కూటమితో పొత్తును బ్రేక్ చేసేసుకుంది. ఇందుకు గల కారణాలేంటో తెలుసుకుందాం (aiadmk vs bjp). AIADMKకి BJPకి మధ్య వైరం ఏర్పడటానికి కారణం అన్నామలై (annamalai). ఇతను తమిళనాడు BJP రాష్ట్ర అధ్యక్షుడు. అన్నాడీఎంకే BJPతో పొత్తులో ఉందని తెలిసి కూడా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేతల పట్ల నోటికొచ్చినట్లు మాట్లాడేవాడు. పలుమార్లు అన్నాడీఎంకే అన్నామలైను హెచ్చరిస్తున్నప్పటికీ అతను పద్ధతి మార్చుకోలేదు. అన్నాడీఎంకే NDAలో భాగమే అని BJP కూడా అన్నామలైకి నచ్చజెప్పలేదు. దాంతో అన్నాడీఎంకేకి ఒళ్లుమండింది. BJPతో పొత్తును విరమించుకుంది.
ముందు నుంచీ అన్నామలైకి అన్నాడీఎంకే BJP పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు. ప్రాంతీయ ఎన్నికల్లో BJP ఒంటరిగా పోటీ చేస్తేనే మంచిది అని మొదటి నుంచి అన్నామలై అనుకుంటున్నాడు. కాస్త సమయం పట్టినా కూడా తమిళనాడులో BJP అధికారం చేజిక్కించుకోవాలని అన్నామలై ఆలోచన. ఇది అన్నాడీఎంకే నేతలకు అర్థమైంది. ముందుగానే వారి కుట్రను అర్థం చేసుకుని పొత్తు నుంచి బయటికి వచ్చేసారు. (aiadmk vs bjp)
గొడవ మొదలైంది ఇలా..
ఈ ఏడాది మార్చిలో అన్నామలై సహచరుడు అయిన BJP ఐటీ వింగ్ చీఫ్ నిర్మల్ కుమార్ BJPని వదిలి అన్నాడీఎంకేలో చేరాడు. అది అన్నామలైకు అస్సలు నచ్చలేదు. నిర్మల్ కుమార్‌ని చూసి మరికొందరు BJP నేతలు అన్నాడీఎకే పక్షాన చేరారు. దాంతో అక్కడి నుంచి గొడవ మొదలైంది. అప్పటినుంచి అన్నామలై అన్నాడీఎంకేను ఏదో ఒక రకంగా అవమానిస్తూనే ఉన్నాడు. ఈ కోపంతోనే జులైలో DMK ఫైల్స్ పేరుతో అధికార DMK పార్టీ అవినీతికి సంబంధించిన విషయాలను అన్నామలై బయటపెట్టాడు. ఇంతవరకు బాగానే ఉంది కానీ.. అన్నామలై మీడియా ముందుకు వచ్చి ఒక మాట అన్నాడు. ఇవి DMK ఫైల్స్ మాత్రమే. త్వరలో తమిళనాడులోని అన్ని పార్టీలకు సంబంధించిన అవినీతిని బయటపెడతాను. AIADMKతో సహా అని వాగాడు. మరి అన్నాడీఎంకేకి కోపం రావడంలో అర్థం ఉంది కదా..!
జయలలితను టార్గెట్ చేసి..
అన్నామలై BJP పార్టీలో ఉంటున్నప్పటికీ.. సొంత రాష్ట్రం తమిళనాడుకి చెందిన దివంగత మాజీ సీఎం జయలలితను (jayalalitha) కూడా వదల్లేదు. ఆమె ఎన్నో అవినీతి పనులు చేసి జైలుకు కూడా వెళ్లిందని ఆరోపించాడు. ఈ ఘటనతో అన్నాడీఎంకేకు BJP అంటే విరక్తి కలిగింది. రానున్న ఎన్నికల్లో తమిళనాడులో ముఖ్యమంత్రి అభ్యర్ధిగా ఎడప్పాడి పళనిస్వామిని ప్రకటించాలని అన్నాడీఎంకే నిర్ణయించుకుంది. ఇందుకు కూడా అన్నామలై ఒప్పుకోలేదు. అన్నాడీఎంకే పార్టీ నుంచి సీఎం అభ్యర్ధిని ఎంపికచేసే హక్కు BJPకి మాత్రమే ఉందని అన్నామలై తెలిపాడు. (aiadmk vs bjp)
అన్నాదురైపై తప్పుడు వ్యాఖ్యలు
ఏ రాజకీయ పార్టీ అయినా దేనినైనా సహిస్తుందేమో కానీ తమ రాష్ట్రంలో దైవంగా కొలిచే వ్యక్తులను ఏమన్నా అంటే ఊరుకోదు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి.. ద్రవిడ ఐకాన్‌గా పేరుగాంచిన సీఎన్ అన్నాదురైపై (cn annadurai) కూడా అన్నామలై నోటికొచ్చినట్లు వాగాడు. దాంతో అన్నాడీఎంకే అతనిపై నిప్పులు చెరిగింది. వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. కానీ అన్నామలై అందుకు ఒప్పుకోలేదు. దాంతో అన్నాడీఎంకే నేతలు కేంద్రమంత్రులు అమిత్ షా, జేపీ నడ్డాలను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. తమిళనాడులో NDA కన్వీనర్‌గా వేరొకరిని నియమించి అన్నామలైను తప్పిస్తే ఎన్నికలు ఎలాంటి గందరగోళం లేకుండా జరుగుతాయని రిక్వెస్ట్ చేసారు. ఇందుకు వారు ఒప్పుకోలేదు. దాంతో ఇక అన్నాడీఎంకే పొత్తును విరమించుకోవాలని నిర్ణయించుకుంది.