Women’s Reservation Bill పూర్తి కథనం
పార్లమెంట్‌లో ప్రధాని నరేంద్ర మోదీ (narendra modi) మహిళా రిజర్వేషన్ బిల్లుకు (women’s reservation bill) ఆమోదం తెలిపారు. దాంతో ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ఎంతో కృషి చేసిన పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై దృఢంగా తమ గొంతుక వినిపించినవారిలో BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (kalvakuntla kavitha) ఒకరు. అసలు ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్రేంటి? ఎవరు ముందు ప్రవేశపెట్టారు? వంటి అంశాలను తెలుసుకుందాం.
మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఏంటి?
2008లో రాజ్యాంగంలో చేర్చిన ఆర్టికల్ 108 ప్రకారం.. పార్లమెంట్‌లో మహిళలకు 33% సీట్లు కేటాయించాలి. ఈ 33% కోటాలోనే SC, ST, ఆంగ్లో ఇండియన్ మహిళలకు అవకాశం ఉంటుంది. అయితే ఈ బిల్లుని ప్రవేశపెట్టిన సంవత్సరం నుంచి 15 సంవత్సరాల వరకు మాత్రమే వర్తిస్తుంది. ఆ తర్వాత పార్లమెంట్‌లో మళ్లీ దీనిపై చర్చించి మార్పులు, సవరణలు చేస్తే అప్పుడు మళ్లీ కొనసాగే అవకాశం ఉంటుంది. (women’s reservation bill)
ఈ బిల్లు చరిత్రేంటి?
1989లో దివంగత భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఈ బిల్లును తొలిసారి పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారు కానీ ఎవ్వరూ కూడా ఆమోదం తెలపలేదు.ఆ తర్వాత 1992 నుంచి 1993 మధ్యలో అప్పటి ప్రధాని పీవీ నరసింహా రావు 72, 73 అనే రెండు రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రవేశపెట్టారు. ఈ బిల్లులు లోక్ సభ, రాజ్యసభల్లో ప్రవేశపెట్టగా ఆమోదం దక్కింది. దాంతో దేశవ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది మహిళలకు పంచాయతీల్లో నగర పాలక నియోజకవర్గాల్లో పోటీ చేసే వీలు దక్కింది. 1996 సెప్టెంబర్‌లో అప్పటి ప్రధాని దేవెగౌడకు చెందిన కూటమి 81వ రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. కానీ లోక్ సభలో ఈ బిల్లుకు ఆమోదం దక్కలేదు. దాంతో గీతా ముఖర్జీ నేతృత్వంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీని వేసి ఈ బిల్లుపై క్షేత్రస్థాయిలో చర్చలు జరిపి ఓ నివేదిక ఇవ్వాలని కోరారు. కానీ అప్పటికే లోక్ సభ పడిపోవడంతో ఈ బిల్లును ఆమోదించడం కుదరలేదు.
1998లో అటల్ బిహారీ వాజ్‌పేయీ కూటమి సమయంలో ఆయన మళ్లీ ఈ బిల్లును ప్రవేశపెట్టాలనుకున్నారు. అప్పుడు కూడా ఈ బిల్లుకు ఆమోదం దక్కలేదు. అలా 1999, 2002, 2003లలోనూ వాజ్‌పేయీ ఈ బిల్లును ప్రవేశపెట్టాలనుకుని ఫెయిల్ అయ్యారు. ఐదేళ్ల తర్వాత మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు. ఆయన ఈ బిల్లును 2008లో ప్రవేశపెట్టారు. సుదీర్ఘ చర్చల తర్వాత ఈ బిల్లును యూనియన్ కేబినెట్ 2010లో ఆమోదించింది. ఈ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం దక్కింది కానీ లోక్ సభ మాత్రం పట్టించుకోలేదు. దాంతో 2014లో ఈ బిల్లు ఫెయిల్ అయింది. కానీ ఏ బిల్లు అయినా రాజ్యసభలో పాస్ అయితే అది యాక్టివ్‌గానే ఉంటుంది. అలా ఎందరో మహిళా నేతలు కృషి చేయగా మొత్తానికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ బిల్లు కోసం కల్వకుంట్ల కవిత ఇతర పార్టీలకు చెందిన మహిళా నేతలతో కలిసి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షను కూడా చేపట్టారు. (women’s reservation bill)