ఎప్పుడూ లేనిది.. ఇప్పుడే ఎందుకు?
Telangana Elections: రానున్న తెలంగాణ ఎన్నికల్లో సీఎం KCR రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకటి ఆయన నియోజకవర్గం అయిన గజ్వేల్ (gajwel) మరొకటి కామారెడ్డి (kamareddy). అసలు KCR ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో గజ్వేల్‌లో కాకుండా మరెక్కడా పోటీ చేయలేదు. అలాంటిది ఈసారి ఎన్నికల్లో ఎందుకు రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నారని అందరూ తెగ ఆలోచించేస్తున్నారు.
ఓ పక్క ప్రత్యర్ధి పార్టీలేమో ఈసారి గజ్వేల్‌లో ఓడిపోతారని ఆయనకు ముందే తెలుసు కాబట్టే సేఫ్ సైడ్ కోసం కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని.. ఏదో ఒక సీట్ దక్కుతుందన్న ఆశతోనే రెండు చోట్లా పోటీకి దిగుతున్నారని అంటున్నాయి. ఒకవేళ ఈ రెండు చోట్ల నుంచి ఏ సీటు ఓడిపోయినా కూడా ఆ ఓటమి చాలా ఘోరంగా ఉండనుందని అంటున్నారు. 2004 వరకు KCR నియోజకవర్గం సిద్ధిపేట (siddipet). దాదాపు 20 ఏళ్ల పాటు ఆయన సిద్ధిపేట ఎమ్మెల్యేగానే పోటీ చేస్తూ వచ్చారు.
2004 నుంచి 2014 వరకు ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2014లో గజ్వేల్‌లో పోటీ చేసిన KCR.. TDPకి చెందిన ప్రతాప్ రెడ్డిని ఓడించి మరీ దిగ్విజయాన్ని సొంతం చేసుకున్నారు. సిద్ధిపేట సీటును కేసీఆర్ ఖాళీ చేయగానే ఆయన అల్లుడు హరీష్ రావు (harish rao) ఆ స్థానాన్ని దక్కించుకున్నారు.ఎప్పటినుంచైతే కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేయడం మొదలు పెట్టారో అప్పటి నుంచి గజ్వేల్‌ను వీఐపీ సీటుగా చూడటం మొదలుపెట్టారు.
ప్రతాప్ రెడ్డి TDP నుంచి కాంగ్రెస్‌కు.. ఆ తర్వాత BRSలో చేరిన తర్వాత గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడించే వారే లేకుండాపోయారు. ఈ తరుణంలో కేసీఆర్‌తో విభేదాలు వచ్చి BRS నుంచి BJPకి పోయిన ఈటెల రాజేందర్ ఈసారి కేసీఆర్‌ను ఓడించేందుకు తన నియోజకవర్గం అయిన హుజూరాబాద్‌లోనే కాకుండా గజ్వేల్‌లో కూడా పోటీ చేయనున్నారు.
అయితే ఈటెల రాజేందర్‌కు ముదిరాజ్ వర్గం నుంచి మంచి సపోర్ట్ ఉంది. యావత్ తెలంగాణలో ముదిరాజ్ వర్గానికి చెందినవారు 12% ఉన్నారని కొన్ని నివేదికలు చెప్తున్నాయి. ఎప్పుడైతే కేసీఆర్ ఈటెలపై ఆరోపణలు రావడంతో ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించారో అప్పటినుంచి ముదిరాజ్ కమ్యూనికీ కూడా కేసీఆర్‌కు వ్యతిరేకంగా మారిపోయింది. గజ్వేల్‌లో ముదిరాజ్ వర్గానికి చెందిన ఓట్లు బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఆ ఓట్లు కేసీఆర్‌కు పడతాయా లేక ఈటెలకు పోతాయా అనేది పెద్ద ప్రశ్న.
తనను పార్టీ నుంచి గెంటేసినందుకు కేసీఆర్ ముదిరాజ్ వర్గానికి వ్యతిరేకి అని పలమార్లు ఈటెల ప్రచారం చేస్తూ వచ్చారు. అదీకాకుండా తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో ఏ ఒక్క సీటు కూడా ముదిరాజ్ వర్గానికి చెందిన అభ్యర్ధికి ఇవ్వలేదు. ముదిరాజ్ ఓట్లు కేసీఆర్‌కు పడే ఛాన్స్ లేదు అనడానికి ఇది మరో కారణం. ఇవన్నీ ఆలోచించుకునే గజ్వేల్‌లో ఓటమి పాలయ్యే అవకాశం ఉందని ముందే గ్రహించిన కేసీఆర్.. కామారెడ్డిలో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.