చంద్రబాబు పథకాలు.. కొత్తగా ఏమిస్తున్నారు?
Chandrababu Naidu: ఈసారి జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections) ఎలాగైనా మళ్లీ అధికారంలోకి రావాలని చాలా తీవ్రంగా కృషి చేస్తున్నారు తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. ఇందుకోసం నానా పాట్లు పడి జనసేనతో కలిసి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఎందుకైనా మంచిదని ముందుగానే సూపర్ 6 అంటూ మినీ మేనిఫెస్టో రిలీజ్ చేసేసారు. ఇక అసలైన మేనిఫెస్టో కోసం జనసేన, భారతీయ జనతా పార్టీతో సంప్రదింపులు జరిపి అప్పుడు విడుదల చేస్తారని తెలుస్తోంది.
రానున్న ఎన్నికల్లో తాను అధికారంలోకి వస్తే ప్రస్తుతం ఉన్న పెన్షన్‌ను రూ.4000 వరకు పెంచుతానని అన్నారు. ప్రతి నెలా ఇంటికే వచ్చి పెన్షన్ డబ్బులు ఇచ్చే ఏర్పాట్లు చేస్తానని తెలిపారు. ఇందులో కొత్తే ముంది? ప్రస్తుతం అధికారంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి రూ.3000 వరకు పెన్షన్ ఇస్తున్నారు. అదికూడా వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తున్నారు. మరి ఇందులో చంద్రబాబు నాయుడు రూ.1000 పెంచి ఇస్తానని చెప్పడంలో అర్థమేముంది? అన్న ప్రశ్నలు వెలువడుతున్నాయి.
అందులోనూ జగన్ కూడా తాను మళ్లీ అధికారంలోకి వస్తే ఆ పెన్షన్‌ను రూ.4000 చేస్తానని ప్రకటించారు. మరి ఇందులో చంద్రబాబు కొత్తగా ఇస్తున్న పథకమేంటో ఆయనే ఒకసారి స్వీయ పరిశీలన చేసుకోవాలి. కనీసం చంద్రబాబు పెన్షన్ విషయంలో కొత్తగా ఏదన్నా నిర్ణయించాల్సింది. అందులోనూ పెన్షన్ మొత్తంలోని ఎక్కువ భాగం నిధులు వచ్చేది కేంద్రం నుంచే. సో.. ఇప్పుడు పెన్షన్ విషయంలో ఏవన్నా మార్పులు చేస్తే ఆ క్రెడిట్ భారతీయ జనతా పార్టీకి కూడా వెళ్తుంది.