Shahrukh Khan: ఖతార్ నుంచి నేవీ అధికారుల రిలీజ్.. షారుక్ సాయం చేసారా?
Shahrukh Khan: గూఢచర్యం ఆరోపణల కారణాల వల్ల 18 నెలల పాటు ఖతార్ (Qatar) జైల్లో శిక్ష అనుభవించిన ఎనిమిది మంది భారతీయ నేవీ అధికారులు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. వారిలో ఏడుగురు భారత్‌లో అడుగుపెట్టేసారు. కేంద్ర ప్రభుత్వం నిరంతరం చేసిన కృషి వల్లే వారు ఖతార్ వేసిన ఉరిశిక్ష నుంచి తప్పించుకున్నారు. అయితే ఇక్కడ ఓ విషయం చర్చనీయాంశంగా మారింది. అదేంటంటే.. మన నేవీ అధికారులను ఖతార్ శిక్ష నుంచి విడిపించడంలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ హస్తం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే.. ఏ రోజైతే భారత నేవీ అధికారులు ఇండియాలో అడుగుపెట్టారో అదే రోజున షారుక్ ఖాన్ ఖతార్‌లో కనిపించారు. (Shahrukh Khan)
రాజ్యసభ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి (Subramanian Swamy) కూడా ఇదే మాటన్నారు. షారుక్ ఖాన్ ఖతార్ ప్రభుత్వంతో మాట్లాడి ఎనిమిది మంది భారత నేవీ అధికారులను విడిపించారని కామెంట్స్ చేసారు. “భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశాంగశాఖ, జాతీయ భద్రతా ఏజెన్సీల ద్వారా మన భారత నేవీ అధికారులను ఖతార్ షేక్‌ల నుంచి విడిపించలేకపోయారు. అప్పుడే బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్‌ను తనతో పాటు ఖతార్‌కు తీసుకెళ్లాల్సింది. ఎప్పుడైతే విదేశాంగశాఖ, జాతీయ భద్రతా ఏజెన్సీలు వారిని విడిపించడంలో విఫలమయ్యారో.. అప్పుడు మోదీ షారుక్ ఖాన్‌ను బతిమిలాడారు. అలా షారుక్ మోదీ మాటను గౌరవించి ఖతార్ షేక్‌లతో మాట్లాడి మన అధికారులను విడిపించారు “” అని సుబ్రహ్మణ్య స్వామి ట్వీట్ చేయడం వివాదాస్పదంగా మారింది.
దీనిపై షారుక్ ఖాన్ స్పందించారు. తాను ఖతార్ వెళ్లిన మాట వాస్తవమే కానీ నేవీ అధికారులను విడిపించడానికి తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఇలాంటి ప్రభుత్వ కార్యకలాపాలు ప్రభుత్వాలే చూసుకుంటాయి కానీ నటుల ద్వారా సాధ్యం కాదని తెలిపారు. భారత నేవీ అధికారుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
అయితే ఎనిమిది మంది అధికారుల్లో కేవలం ఏడుగురు మాత్రమే భారత్‌కు చేరుకున్నారు. ఒక్క వ్యక్తి మాత్రం మిస్సయ్యారు. అతను ఏమైపోయారు? ఖతార్ ప్రభుత్వం విడిచిపెట్టిందా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న వివరాలను అధికారులు కూడా ఇంకా వెల్లడించలేదు. ఓ నేవీ అధికారి మీడియాతో మాట్లాడుతూ.. భారత ప్రధాని నరేంద్ర మోదీ కలగజేసుకోకపోయి ఉంటే తాము బతికి ఇలా ఇండియా చేరుకునేవాళ్లం కాదని ఆనందాన్ని వ్యక్తం చేసారు. ఎప్పటికప్పుడు భారత్ ప్రభుత్వం తమ గురించి తెలుసుకుంటూ అన్ని రకాల ప్రయత్నాలు చేసింది కాబట్టే ప్రాణాలతో బయటపడ్డామని అన్నారు.
మరో అధికారి మాట్లాడుతూ.. “” మేం దాదాపు 18 నెలల పాటు ఇండియాకు ఎప్పుడెప్పుడు వస్తామా అని జైల్లో ఎదురుచూస్తూ కూర్చున్నాం. ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఆయన పర్సనల్‌గా ఈ విషయాన్ని తీసుకుని మా కోసం పోరాడకపోయి ఉంటే బతికేవాళ్లం కూడా కాదు. ప్రధానికి ఖతార్‌తో మంచి సత్సంబంధాలు ఉండటం కూడా మేం బయటపడటానికి ఒక కారణం. మాకోసం ఎంతో కష్టపడి మమ్మల్ని మా కుటుంబాల వద్దకు చేరుస్తున్న భారత ప్రభుత్వానికి రుణ పడి ఉంటాం “” అని తెలిపారు.