viveka case: ఆయన వల్లే కొడుకు పుట్టాడు.. ఆస్తిలో వాటా ఇవ్వాల్సిందే!
Hyderabad: వైఎస్ వివేకా(viveka case) హత్య కేసులో ఇవాళ మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. వివేకా రెండో భార్య షమీం(shamim) శుక్రవారం సీబీఐకి సంచలన స్టేట్‌మెంట్ ఇచ్చారు. దీంతో ఈ కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. వివేకాతో తనకు రెండు సార్లు పెళ్లి జరిగిందని ఈ సందర్బంగా ఆమె పేర్కొన్నారు. తనను పెళ్లి చేసుకోవడం ఇంట్లో వారికి ఇష్టం లేదని.. అందుకే ఎక్కువగా హైదరాబాద్‌లోనే కలుసుకునే వాళ్లమని షమీం తెలిపారు. ఈ క్రమంలో 2015లో తమకు ఓ కుమారుడు జన్మించారని పేర్కొన్నారు. వివేకా అల్లుడి అన్న అయిన… శివప్రకాశ్‌రెడ్డి(shiva prakash reddy) తనను చాలాసార్లు బెదిరించారని ఆమె తెలిపారు. ఈనేపథ్యంలోనే వివేకాకు దూరంగా ఉండాలని ఆయన కుమార్తె సునీతారెడ్డి(sunitha reddy) కూడా హెచ్చరించారని వెల్లడించారు. అందుకే దూరంగా ఉంటున్నానని చెప్పుకొచ్చారు.
వివేకా చనిపోయినప్పుడు కూడా.. మృతదేహాన్ని చూసేందుకు శివప్రకాశ్‌రెడ్డికి భయపడే వెళ్లలేదని తెలిపారు. తనకు ఇప్పుడు వివేకా ఆస్తిలో వాటా కావాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు షమీం లాయర్ మీడియాకు తెలిపారు. దీనిపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేస్తామని ఆయన అన్నారు. అవసరమైతే షమీం కొడుక్కి డీఎన్‌ఏ టెస్టు కూడా చేయించేందుకు రెడీ అని అన్నారు.
వివేకానందరెడ్డి.. తన కుమారుడి పేరుతో భూమి కొనాలని తనతో చెప్పారని.. ఆ భూమి కొనకుండా శివప్రకాశ్‌రెడ్డి అడ్డుకున్నారని… అంతేకాకుండా.. వివేకాకు చెక్ పవర్ తొలగించడంతో ఆయన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆమె చెప్పుకొచ్చారు. ఇక హత్య కు కొన్ని గంటల ముందు వివేకా తనతో మాట్లాడారని షమీం వెల్లడించారు.
వివేకా హత్య జరిగి దాదాపు నాలుగేళ్లు కావస్తోంది. అప్పటి నుంచి ఆయన రెండో భార్య మీడియా ముందుకు కానీ.. మరెక్కడా కనిపించలేదు. ఇప్పుడు సడెన్‌గా సీన్‌లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఈ హత్య వెనుక పెద్దవారు ఉన్నారని పలువురు అంటున్నారు.