Viveka Case: రెండో రోజు సీబీఐ విచారణ.. ముగ్గుర్నీ వేర్వేరుగానే!
Hyderabad: మాజీ మంత్రి వివేకా హత్య కేసు(ys viveka murder case)కు సంబంధించి.. సీబీఐ విచారణ రెండో రోజు కొనసాగుతోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి, తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు రెండో రోజు విచారిస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని సీబీఐ కోర్టు ఇది వరకే ఆదేశించింది. ముగ్గురినీ వేర్వేరుగా విచారిస్తున్నట్లు సమాచారం. ఎంపీ అవినాష్ నుంచి కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు రాబట్టేందుకు సీబీఐ అధికారులు ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నిన్న సుదీర్ఘంగా ఎనిమిది గంటల పాటు అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు జరిగిన పరిణామాలపై ఆరా తీశారు. నిందితులతో జరిపిన ఆర్థిక లావాదేవీలపై ఎంపీని సీబీఐ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మరోవైపు సీబీఐ కొత్త ఆఫీసర్ వికాస్ సింగ్‌కు అవినాష్ రెడ్డి లేఖ రాశారు. వైఎస్ వివేక హత్య జరిగిన రోజు దొరికిన లేఖపై దర్యాప్తు జరపాలని… వివేకా అల్లుడు రాజశేఖర్‌ను కూడా విచారించాలని కోరారు.
వివేకా హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్ రెడ్డి(ys bhaskar reddy) , ఉదయ్ కుమార్ రెడ్డి(udaykumar reddy), కస్టడీ విచారణ ఆడియో, వీడియో రికార్డింగ్ చేయాల్సిందేనని తెలంగాణ హైకోర్టు(telangana high court) మరోసారి స్పష్టం చేసింది. కస్టడీలో సీబీఐ సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ పాటించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి వేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. కస్టడీ విచారణలో సుప్రీంకోర్టు, హైకోర్టు మార్గదర్శకాలు పాటించాలని స్పష్టం చేసింది. అలాగే న్యాయవాదిని రెండు గంటల వరకు అనుమతించాలన్న సీబీఐ కోర్టు ఉత్తర్వులు ధర్మాసనం సవరించింది. సాయంత్రం 5 గంటల వరకు అంటే విచారణ పూర్తయ్యే వరకు న్యాయవాదిని అనుమతించాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.