Viveka Case: అవినాష్ రెడ్డి విచారణ వాయిదా.. పులివెందులకు ఎంపీ!
Pulivendula: వైఎస్ వివేకా హత్య కేసుకు (YS Viveka Case) సంబంధించి CBI విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఎంపీ అవినాశ్ రెడ్డికి (MP Avinash Reddy) సోమవారం సీబీఐ (CBI) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే.. ఈ విచారణకు తాను హాజరు కాలేనని, తనకు కొన్ని వ్యక్తిగత పనులు ఉన్నాయని ఎంపీ అవినాష్.. సీబీఐ అధికారులకు తెలిపారు. కనీసం నాలుగు రోజులు సమయం ఇవ్వాలని కోరగా.. సీబీఐ తాజాగా స్పందించింది. ఈనెల 19న విచారణకు హాజరుకావాలని మరోసారి వాట్సప్ రూపంలో సందేశాన్ని అధికారులు పంపారు.
దీంతో అవినాష్ ఈనెల 19న విచారణకు రావాల్సి ఉంది. తొలుత ఇవాళ విచారణకు అవినాష్ హాజరు కాని పక్షంలో అతనిపై చర్యలు తీసుకుంటామని సీబీఐ పరోక్షంగా చెప్పగా.. చివరికి అవినాష్ కోరికమేరకు.. రెండు రోజులు గడువు ఇచ్చింది. మరోవైపు హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర కీలకంగా ఉందని సీబీఐ భావిస్తోంది. అందుకే ఇప్పటకే మూడు సార్లు ఆయన్ను విచారించారు. నాలుగో సారి కూడా విచారించేందుకు సిద్దం అవుతున్నారు. వివేకా హత్య తర్వాత సాక్ష్యాలను ధ్వంసం చేసిన ఆరోపణలను అవినాష్ ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి పలు వివరాలను ఇతరుల నుంచి అధికారులు రాబట్టారు. దీనిపై ఇప్పుడు ప్రశ్నించే అవకాశం ఉంది. ఇక అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ వాయిదా పడటంతో ఆయన హైదరాబాద్ నుంచి పులివెందుల వెళ్లినట్లు సమాచారం. అక్కడే కొన్ని రోజులపాటు.. పార్లమెంట్ పరిధిలో పలు ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారని.. అవినాష్ అనుచరులు చెబుతున్నారు.