Vijaya Sai Reddy: సొంత పార్టీ నుంచే అవ‌మానం.. YSRCPకి గుడ్‌బై?

Vijaya Sai Reddy is ready to switch party

Vijaya Sai Reddy:  విజ‌య‌సాయి రెడ్డి.. ఒకప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ర్వాత నెంబ‌ర్ 2 స్థానంలో ఉండేవారు. ఇప్పుడు నెంబ‌ర్ 2 కాదు కదా.. క‌నీసం ఆయ‌న ఒక సీనియ‌ర్ నేత అని కూడా గుర్తించ‌డంలేదు. పైగా ఆయ‌న‌పై అక్ర‌మ సంబంధాలు అనే ద‌రిద్ర‌పుగొట్టు ఆరోప‌ణ‌లు బ‌య‌టికి వ‌చ్చాయి. దేవ‌దాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ క‌లింగిరి శాంతికుమారితో విజ‌య‌సాయికి అక్ర‌మ సంబంధం ఉంద‌ని ఆయ‌న ద్వారా ఆమె గ‌ర్భం దాల్చింద‌ని శాంతికుమారి భ‌ర్త మ‌ద‌న్ మోహ‌న్ తీవ్ర‌స్థాయిలో ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. విజ‌య‌సాయి త‌న నిజాయ‌తీని నిరూపించుకోవాలంటే డీఎన్ఏ ప‌రీక్ష‌కు హాజ‌రు కావాల్సిందే అని లేక‌పోతే తాను నిరాహార దీక్ష చేప‌డ‌తాన‌ని హెచ్చ‌రించారు.

పార్టీ నుంచి రాని స్పంద‌న‌

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఏ నేత‌కు సంబంధించిన ఆరోప‌ణ‌లు వ‌చ్చినా ఇత‌ర నేత‌లు వాటిని తిప్పి కొట్టేందుకు సిద్ధంగా ఉంటారు. ముఖ్యంగా పేర్ని నాని, కాకాణి గోవ‌ర్ధ‌న్ రెడ్డి ఎవ‌రి మీద ఆరోప‌ణ‌లు వ‌చ్చినా ప్రెస్ మీట్లు పెట్టి తెగ స్పందించేవారు. కానీ విజ‌య‌సాయి రెడ్డి విష‌యంలో ఇప్ప‌టివ‌ర‌కు ఏ ఒక్క నేత బ‌య‌టికి వ‌చ్చి ఆ ఆరోప‌ణ‌ల‌ను ఖండించ‌డం కానీ విజ‌య‌సాయికి మ‌ద్ద‌తు తెల‌ప‌డం కానీ చేయ‌లేదు. దాంతో పాపం ఆయ‌న పార్టీలో ఒంట‌రి వాడు అయిపోయాడు.

పైగా త‌న‌పై ఈ ఆరోప‌ణ‌లు చేయిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారే అని కూడా ఆయ‌న ప్రెస్‌మీట్‌లో బ‌యట‌పెట్టారు. పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి కానీ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కానీ ఇలాంటి ప‌నుల‌కు పాల్ప‌డుతుంటార‌నే టాక్ ఉంది. ఒక పార్టీ సీనియ‌ర్ నేత‌పై.. జ‌గ‌న్ త‌ర్వాత అంత‌టి స్థాయిలో పేరున్న నేత‌పై ఇంతటి ఘోర‌మైన ఆరోప‌ణ‌లు వ‌స్తుంటే.. క‌నీసం ఒక్క స్పంద‌న కూడా ఇవ్వ‌లేదు పార్టీ అధినేత‌ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. ఆయ‌న బ‌య‌టికి వ‌చ్చి త‌న పార్టీ నేత త‌ప్పు చేసి ఉంటే శిక్ష ప‌డుతుంద‌ని కానీ.. విజ‌య‌సాయి త‌ప్పు చేసి ఉండ‌రు అని కానీ జ‌గ‌న్ చెప్ప‌క‌పోవడంతో జ‌గ‌న్‌కు విజ‌య‌సాయి మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింద‌న్న అంశం క్లియ‌ర్‌గా ఉంది.

ఈ నేప‌థ్యంలో మొన్న ప్రెస్ మీట్ పెట్టిన‌ప్పుడు విజ‌య‌సాయి ఒక కీల‌క వ్యాఖ్య చేసారు. ఒక‌ప్పుడు తాను ఒక మీడియా ఛానెల్‌ను స్టార్ట్ చేస్తానంటే జ‌గ‌న్ ఒప్పుకోలేద‌ని ఇప్పుడు జ‌గ‌న్ ఒప్పుకున్నా లేక‌పోయినా తాను మీడియా ఛానెల్ పెట్టి తీర‌తాన‌ని అన్నారు. తాను ఏ పార్టీలో ఉన్నా కూడా మీడియా ఛానెల్ పెట్ట‌డ‌మైతే ప‌క్కా అన్న‌ట్లు చెప్పారు. ఆయ‌న మాట‌ల్ని బ‌ట్టి చూస్తే విజ‌య‌సాయి పార్టీ మారే అవ‌కాశం ఉన్న‌ట్లు స్ప‌ష్టం అవుతోంది.